గ్యాంగ్ స్టర్ నయీమ్ (Nayeem) కు చెందిన 35 ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. మొత్తం 35 చోట్ల నయీంకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. నయీం కుటుంబసభ్యుల పేర్ల మీద అవన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమంగా, బలవంతంగా నయీం తన కుటుంబసభ్యుల పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ చేయించినట్లు ఈడీ అంచనాకు వచ్చింది. 2022 లో నయీంపై (Nayeem)ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. అప్పటినుంచి ఐటీ అధికారులు, సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే ఆస్తులకు సంబంధించి సమన్లు పంపించినా నయీం కుటుంబసభ్యులు ఎవరూ స్పందించడం లేదు. మరోవైపు కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేయలేదు. అందులో భాగంగానే నయీం ఆస్తులను జప్తు చేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నది.
అక్రమంగా ఆస్తులు రాయించుకున్న నయీమ్
మావోయిస్టు పార్టీలోపనిచేసిన నయీం తర్వాత పోలీసులకు లొంగిపోయారు. సెటిల్మెంట్లకు తెరరలేపాడు. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, వ్యాపారులను బెదిరించి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడ బెట్టాడు. అక్రమంగా, బలవంతంగా ఆస్తులను నయీం తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. కొందరికి ఆయన బినామీగా కూడా వ్యవహరించినట్టు ఆరోపణలున్నాయి. సిటీ శివారు జిల్లాల్లో హవా నడిపించిన ఆయన పోలీస్ ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. అక్రమాస్తులను నయీమ్ కుటుంబ సభ్యులు హసీనా బేగం ,తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలాబేగం, సయ్యద్ నిలోఫర్ , ఫిర్దోస్ అంజూమ్, మహమ్మద్ ఆరిఫ్ ,హసీనా కౌసర్ పేర్ల మీద రిజిస్టర్ చేసినట్లు ఈడి గుర్తించారు. భువనగిరి క్రిస్టియన్ గోస్పెల్ మిషన్ సెక్రటరీ ప్రభాకర్ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అక్రమంగా సంపాదించిన 35 ఆస్తులను గుర్తించిన ఈడీ అధికారులు వీటిపై ఈసీఐఆర్ నమోదు చేశారు. బినామీ ఆక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ రెడీ అవుతోంది.
Also read:

