తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ?(Harish Rao) అస్వస్థతకు గురై హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం నుండి (Harish Rao) తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతల సూచన మేరకు వైద్య సాయం కోసం ఆసుపత్రిని ఆశ్రయించారు.
వైద్యుల ప్రాథమిక పరీక్షల ప్రకారం, హరీష్ రావు ప్రస్తుతం వైరల్ ఫీవర్, నీరసం కారణంగా అస్వస్థతకు గురైయ్యారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్య బృందం తెలిపింది. ఆయనకు విశ్రాంతి అవసరమని సూచిస్తూ, పూర్తిగా కోలుకునే వరకు ఆందోళన అవసరం లేదని తెలిపారు. ఇంటర్నల్ మెడిసిన్ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ ఎస్ పాటిల్ సుదేష్ నేతృత్వంలో వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.
ఇక మరోవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రాత్రి హరీష్ రావును ఆసుపత్రిలో పరామర్శించారు. కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా హాజరై హరీష్ రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులంతా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
గమనించదగ్గ విషయం ఏమంటే, ఇదే రోజు ఉదయం హరీష్ రావు తెలంగాణ భవన్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సమయంలో, హరీష్ రావు పార్టీ కార్యాలయాన్ని పర్యవేక్షిస్తూ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై దృష్టిపెట్టారు. ఏసీబీ కార్యాలయం నుంచి తిరిగొచ్చిన కేటీఆర్‌కు స్వాగతం పలికిన హరీష్ రావు, ఆ అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే అప్పటికే ఆయన నీరసంగా కనిపించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
కేటీఆర్ ప్రసంగం మొదలయ్యే సరికి హరీష్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆరోగ్యం మరింత బలహీనపడటంతో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఇప్పుడు చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హరీష్ రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also read:

