“బుల్డోజర్లు కేవలం నగరానికి మాత్రమే కాదు… ఇప్పుడు అడవులకు కూడా దారి తిప్పాయ్” అంటూ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న భూ సేకరణ, ఇండ్లు కూల్చివేతల చర్యలపై ఆయన ట్విటర్ వేదికగా గట్టి ఫైర్ (KTR) అయ్యారు.
“పేదల మీద ప్రేమ లేదు. ఆడబిడ్డల పట్ల కనికరం లేదు. పోడు భూముల్లో దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న ఆదివాసీల పైన దాడులు చేయడం అమానుషం,” అంటూ విమర్శించారు. కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ నుంచి అడవుల వరకు బుల్డోజర్లు
కేటీఆర్ వ్యాఖ్యల ప్రకారం, మొన్నటి వరకు బుల్డోజర్లు మూసీ ప్రక్షాళన పేరిట హైదరాబాద్ లోని పేదల ఇండ్లపై పడ్డాయి. ఇప్పుడు అదే ధోరణిలో రాష్ట్రంలోని గ్రామాలు, పోడు భూములు, అటవీ ప్రాంతాలు కూడా హాని చెంది పోతున్నాయని ఆయన తెలిపారు. “లగచర్ల, దిలావర్పూర్, పెద్దధన్వాడ, చారగొండ, సిరసనగండ్ల ప్రాంతాల్లో రైతుల పొలాల్లోకి, ఇండ్ల మీదకి బుల్డోజర్లు తోలుతున్నారు,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసీలపై దాడులు – ప్రజాస్వామ్యానికి విఘాతం:
పోడు భూముల మీద అన్యాయంగా దాడులు చేసి, అక్కడ వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలను బయటకు నెట్టివేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది మానవత్వానికి తలవంచే చర్యగా అభివర్ణించారు. “ప్రశ్నిస్తే కేసులు, ఎదిరిస్తే జైలు” అనే విధంగా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
420 హామీలకు బదులు బుల్డోజర్ పాలసీ:
తొలుత ఇచ్చిన వాగ్దానాలు – 420 హామీలు – ఎక్కడికి పోయాయి అని ప్రశ్నించిన కేటీఆర్, ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చే, కాల్చే పథకాలతో ముందుకెళ్తోందని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను విస్మరించి, అభివృద్ధి పేరిట ప్రజలను బలికొల్పే విధానం తగదని ఆయన హెచ్చరించారు.
ఈ ట్వీట్లపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఆదివాసీల హక్కులను కాపాడే అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బుల్డోజర్లు, భూసేకరణ చర్యలపై ప్రభుత్వం నుంచి స్పందన రానుంది కాని, విపక్షాల విమర్శలు మాత్రం ఊపందుకున్నాయి.
Also read:

