తెలంగాణ రాష్ట్రానికి గోదావరి (Godavari) జలాల్లో నిజమైన వాటా అందాలన్నది ఇప్పటికీ పరిష్కారంకాని సమస్యగా నిలిచింది. ఈ అంశాన్ని మరోసారి హైలైట్ చేస్తూ తెలంగాణ జన సమితి (TJS) అధినేత, (Godavari) ఎమ్మెల్సీ కోదండ రామ్ గారు తేల్చకపోతే తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన “గోదావరి జలాలు – బనకచర్ల ప్రాజెక్ట్” అంశంపై సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. “బనకచర్ల ప్రాజెక్ట్‌కు భూమిపూజ జరగడం, పునాదులు పడటం అన్నీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఒప్పందాల ఆధారంగానే జరుగుతున్నాయి. ఈ ఒప్పందాలు తెలంగాణ హక్కులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి” అని ఆయన మండిపడ్డారు.
కోదండ రామ్ గారి ప్రకారం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నీటి పంపక నిబంధనల ప్రకారం కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి మరియు కృష్ణా నదుల నుంచి అధిక నీటిని వాడుకుంటోందని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తయితే 300 నుంచి 400 టీఎంసీల వరకు గోదావరి నీటిని ఏపీ తరలించుకునే అవకాశం ఉందని, ఇది తెలంగాణకు ఘోర నష్టాన్ని కలిగించే వ్యవహారమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. నీటి పంపకాల విషయంలో తెలంగాణ ప్రజలను మోసం చేశారన్నారు. “తమ తప్పులు బయటపడకుండా ఉండేందుకే బీఆర్ఎస్ నేతలు ప్రజలకు అసలు విషయాలు చెప్పకుండా కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు” అని ఆయన విమర్శించారు.
అలాగే, తెలంగాణకు న్యాయమైన వాటా కోసం ఒక సమగ్ర వ్యూహంతో ప్రభుత్వాన్ని, పాలకులను కౌంటర్ చేయాలని కోదండ రామ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఒకతాటిపై రావాల్సిన అవసరం ఉందని, నీటి విషయంలో తేడాలు సహించరాదని స్పష్టం చేశారు.
ఈ సెమినార్‌లో పలు నీటి నిపుణులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణ కు జరిగిన అన్యాయాన్ని అర్థవంతంగా ప్రజలకు తెలియజేయాలన్నదే వారి ఉద్దేశమని వెల్లడించారు.
Also Read :

