రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. పంటకాలుగానే సాగుతున్న తెలంగాణ రాజకీయ వాతావరణంలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన సవాలు, మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చేసిన ప్రతిస్పందన కలకలం రేపుతున్నాయి. రైతులకు ఎవరేం చేశారన్న అంశంపై చర్చించేందుకు ప్రెస్ క్లబ్‌కు రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దీనిపై మంత్రి పొన్నం మీడియా ఎదుట ఘాటుగా స్పందించారు. “ప్రెస్ క్లబ్లో చర్చ ఎందుకు? అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదా?” అంటూ (Ponnam Prabhakar) ఎదురుప్రశ్నించారు. మనమంతా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులమని, ప్రెస్ క్లబ్ కాదు అసెంబ్లీదే చర్చలకు సరైన వేదిక అని ఆయన స్పష్టం చేశారు.
పొన్నం ప్రభాకర్ అభిప్రాయంలో, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చర్చ జరగాలంటే అది దేవాలయంతో సమానమైన శాసనసభలోనే జరగాలని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ద్వారా అధికారిక లేఖ రాయించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టాలని సూచించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు ఏం చేసింది? బీఆర్ఎస్ హయాంలో ఏం జరగలేదు? అన్నదానిపై స్పష్టత ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు.
బనకచర్ల ప్రాజెక్ట్ అంశాన్ని ప్రస్తావిస్తూ, గత పదేళ్లలో తెలంగాణకు నష్టం కలిగించేలా తీసుకున్న నిర్ణయాలు ఓపెన్ సీక్రెట్ అని పొన్నం అన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి తీసుకున్న నీటి ఒప్పందాలు, రాయలసీమకు నీళ్ల తరలింపులపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామని ఎవరు చెప్పారు? కరెక్డ్… అదే మీరే కదా?” అని కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వానికి రాయలసీమపై ఎటువంటి వ్యతిరేకత లేదని, కానీ తెలంగాణ రైతుల హక్కుల పరిరక్షణ తమ బాధ్యత అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఏ అంశంపైనా చర్చకు సిద్ధమని, ప్రజల ముందే వాస్తవాలు వెల్లడి చేస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీని తప్పించుకుని బహిరంగ వేదికలపై విమర్శలు చేయడం ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నమేనని పొన్నం ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ విజయమే ప్రజల విశ్వాసానికి నిదర్శనమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

