MAHASHIVARATRI: ఉపవాసం ఎలా విరమించాలి

మహా శివరాత్రి( MAHASHIVARATRI) పర్వదినం రోజున ఉపవాసం, జాగరణ, అభిషేకం, బిల్వార్చన చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడి చల్లనిచూపు ఉంటేనే సర్వ సంపదలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు.

మహా శివరాత్రి ( MAHASHIVARATRI) గురించి పార్వతీదేవి ఓసారి పరమేశ్వరుడిని అడిగితే.. శివరాత్రి అంటే తనకెంతో ఇష్టమని.. తన భక్తులు ఆ రోజు ఉపవాసముంటే తానెంతో సంతోషిస్తానని చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే మహాశివరాత్రి పర్వదినం రోజున లోకమంతా శివోహం శివోహం అంటూ చంద్రశేఖరుడిని వేడుకుంటుంది. పగలంతా నియమనిష్ఠతో ఉపవాసం ఉండి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో తొలుత పాలు, తర్వాత పెరుగు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది.

శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఈ సమయంలో కనుక శివున్నిఅభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా ఉప్పొంగిపోతాడు ఆ భోళాశంకరుడు. రాత్రంత జాగరం చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం, ఆకు కూరలు వండి దేవునికి నైవేద్యంగా పెట్టాలి. ఉపవాసం చేసిన వారు తాము తినే కంటే ముందే ఆవుకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేద వారికి అన్నదానం చేసిన తర్వాతే భుజించాలి. పశుపక్ష్యాదులకు కూడా తినే ఆహారం, నీళ్లు పెట్టడం మంచిది. ఇలా చేస్తే.. ఎంతో పుణ్యం లభించడంతో పాటు సమస్త దోషాలు తొలగిపోయి ఈశ్వరానుగ్రహం పొందుతారని పురాణాలు చెబుతున్నారు.

Also Read
SHIVARATRI: జాగారం చేస్తున్నారా? ఒక్క నిమిషం!!

Srisailam: శ్రీశైల భ్రమరాంబ ఎవరు?