రాజాసింగ్ మళ్లీ బీజేపీలోకి? – ధర్మపురి అర్వింద్ కామెంట్స్‌తో కొత్త చర్చ.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి రాజాసింగ్ (Raja singh)చర్చకు కేంద్రంగా మారారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆయన గురించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. “రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు. ఆయనే స్వయంగా రాజీనామా చేశారు. అయినా ఆయన ఎక్కడ ఉన్నా మేము గౌరవిస్తాం,” అని మీడియా సమావేశంలో అన్నారు.
ఆయన ఆసక్తికరంగా మాట్లాడుతూ – “రాజాసింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. వెంటనే మెంబర్ షిప్ వస్తుంది. కొన్ని విషయంలో ఆయనకు మనస్తాపం ఏర్పడింది. అది వ్యక్తిగత స్థాయిలో చూసుకోవాల్సిన విషయం,” అని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో రాజాసింగ్ తిరిగి పార్టీలోకి వస్తారా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.(Raja singh)
ఇకపోతే ఇటీవల తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ – బండి సంజయ్ మధ్య విభేదాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అర్వింద్ – “ఈటల, బండి సంజయ్ వివాదాన్ని పరిష్కరించేందుకు సెంట్రల్ నోడల్ ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేయాలి. పాత, కొత్త బీజేపీ అధ్యక్షులు కలిసి చర్చించాలి,” అని సూచించారు.
ఆయన మాట్లాడుతూ, అన్ని పార్టీల్లో విభేదాలు సహజమని తెలిపారు. “బీఆర్ఎస్‌లో కేటీఆర్, కవిత మధ్య కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీలో ఉండటం సహజం” అని చెప్పి సమతుల్యత చూపే ప్రయత్నం చేశారు.
ఇకపోతే, స్థానిక సంస్థల ఎన్నికలపై ధర్మపురి అర్వింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. “నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి,” అని పిలుపునిచ్చారు.
ఈ వ్యాఖ్యలన్నీ బీజేపీలో నేడు ఏర్పడుతున్న అంతర్గత రాజకీయం, విభేదాల పరిష్కార మార్గాలు వంటి అంశాలపై స్పష్టతనిచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా రాజాసింగ్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకునే సూచనలు రాజకీయంగా కొత్తగా మారవచ్చు.
Also Read :

