Nagarjuna sagar: సాగర్​లో సందడి

నాగార్జునసాగర్ (Nagarjuna sagar)ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ఆ మనోహర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సాగర్​ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దాంతో ఎన్నెస్పీ అధికారులు ప్రజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 2,82,996 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండడంతో 16 గేట్లను 5 ఫీట్లు, 10 గేట్లు 10 ఫీట్ల మేర పైకి ఎత్తి 2,69,476 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.30 అడుగులుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
పులిచింతలకు పెరుగుతున్న ఇన్​ఫ్లో
సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. నాగార్జున సాగర్​ నుంచి విడుదలైన నీరు పులిచింతలకు చేరుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 40.590 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 3,00,651 క్యూసెక్కుల ఇన్​ఫ్లో కొనసాగుతున్నది. దాంతో అధికారులు పులిచింతల ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పర్యాటకుల సందడి(Nagarjuna sagar)
సాగర్​ క్రస్ట్ గేట్ల నుంచి ఎగిసిపడుతున్న నీటి అలల సోయగాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మెయిన్ డ్యాం సమీపంలో పరిసరాలు పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి. నీటి అందాలను సెల్ఫీ తీసుకుంటూ సంబరపడుతున్నారు. రాష్ర్టంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో వాహనాలతో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నాగార్జునసాగర్ డ్యాం, పవర్ హౌస్, కొత్త బ్రిడ్జితో పాటు ఆంధ్ర ప్రాంతంలోని ఎత్తిపోతల, అణుపు ప్రాంతాలు పర్యాటకులతో నిండిపోయాయి. హోటల్స్, రెస్టారెంట్ల వద్ద జనం రద్దీ కనిపిస్తున్నది.

Also Read :