పార్టీలు పత్రికలు నడుపుకోవడం వల్ల జర్నలిజం విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం లో పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు(Revanth reddy). నిబద్ధత కలిగిన జర్నలిస్టులు లక్ష్మణ రేఖ గీసుకోవాలని, పత్రికా సమావేశాల్లో నిజమైన వాళ్లు ఒకవైపు, పార్టీల పత్రికల జర్నలిస్టులు రెండో వైపు ఉండేలా చూసుకోవాలని అన్నారు. జర్నలిస్ట్ అనే పదానికి మీరే డిఫైన్ చేయాలని కోరారు. ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవతెలంగాణ పత్రిక పదో వార్షికోత్సవ సభలో సీఎం మాట్లాడారు. పార్టీలు, యూట్యూబ్ జర్నలిస్టులు, వాళ్లు వాడుతున్న భాష వల్ల జర్నలిజం నైతిక విలువలు కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా సమావేశాల్లో వాళ్లు కూర్చుండే పద్ధతిలోనూ ధిక్కారం కనిపిస్తోందని, స్టేజీ దిగి చెంపలు పగులగొట్టాలన్నంత ఆవేశం వస్తోందని సీఎం అన్నారు. గతంలో జర్నలిస్టులంటే ఎంతో మర్యాద ఉండేదని, ఏదైనా కార్యక్రమాలకు వెళ్లాలంటే ముందుగా సీనియర్ పాత్రికేయులతో మాట్లాడేవారమని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రికలు ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశాయని అన్నారు. అక్షరం ముక్క రానోళ్లు కూడా జర్నలిస్టులు అయ్యారని అన్నారు. ఆవారాగా తిరిగేటోళ్లు, ఎక్కువగా తిట్లొచ్చినోళ్లు జర్నలిస్టు అని తిరుగుతున్నారని అన్నారు(Revanth reddy). పత్రికలు ప్రజాసమస్యలను ప్రతిబింబించేలా విశ్లేషణాత్మక కథనాలు అందించాలని కోరారు. ప్రజల పక్షాన పోరాడటంలో కమ్యూనిస్టులు ముందుంటారని, ఎర్రజెండా అంటే ప్రజలకు ఎంతో విశ్వాసమని అన్నారు. కమ్యూనిస్టులు ఉప్పు లాగా అని, ఉప్పులేని ఏ కూర కూడా రుచించదని, అలాగే కమ్యూనిస్టులు లేని సమాజం కూడా అలాగే ఉంటుందని అన్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి పనికొస్తారో లేదో తెలియదు కానీ ఉన్నోడిని దించేందుకు మాత్రం పనికొస్తారంటూ చమత్కరించారు. ఎవరు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించినా సహించనిది కమ్యూనిస్టులు మాత్రమేనని అన్నారు. తాను నేను నిజం చెప్పకపోయినా సరే కానీ అబద్దం చెప్పనని, దిగిపోయిన నాయకుడు అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని అన్నారు. మల్కాజ్ గిరిలో తన పార్లమెంటు కార్యాలయాన్ని దివంగత సీపీఎం నేత మల్లు స్వరాజ్యంతో ఓపెన్ చేయించానని అన్నారు. కమ్యూనిస్టులంటే తనకెంతో గౌరవమని చెప్పారు.
Also Read :

