తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి (Rajagopal) రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. మంత్రి పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారని, తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని (Rajagopal) రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి అప్పగించామని వెల్లడించారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. “మంత్రుల నియోజకవర్గాలకు నిధులు వెళ్తున్నాయి, కానీ తన నియోజకవర్గానికి ఇవ్వడం లేదన్న భావనతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టుగా అనిపించింది. దీనిపై క్రమశిక్షణ కమిటీ పూర్తిగా విచారించి నివేదిక ఇస్తుంది” అని తెలిపారు.
అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. “బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదు. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ ఇస్తాం” అని ఆయన తెలిపారు. అలాగే మార్వాడీ సమాజంపై జరుగుతున్న విమర్శలను ఖండిస్తూ, “మార్వాడీలు మనలో ఒకరు. వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదు” అని అన్నారు.
గాంధీభవన్ ప్రకాశం హాల్‌లో జరిగిన అసంఘటిత కార్మికుల సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఉదయమే మునుగోడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చూశా. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తేల్చుకోవాలి. క్రమశిక్షణ కమిటీ దీన్ని పరిశీలిస్తుంది” అని మరోసారి స్పష్టం చేశారు.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తిని బయటపెడుతున్నాయి. ఈ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లడం పార్టీ అంతర్గత పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
Also read:
- RS Praveen Kumar: కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చేసే కుట్ర
- NagarjunaSagar: సాగర్ కు పోటెత్తిన పర్యాటకులు

