Ramanthapur: కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం

Ramanthapur

హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని (Ramanthapur) గోఖలేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆనందోత్సాహంగా సాగుతుండగా అర్ధరాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. రథోత్సవం సందర్భంగా రథం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చి ఆరుగురు యువకులు మృతిచెందారు. (Ramanthapur) మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదఘోషలు మోగాయి.

Image

ప్రమాదం ఎలా జరిగింది?

యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర ముగిసిన తరువాత రథాన్ని తీసుకెళ్లాల్సిన వాహనం మొరాయించడంతో యువకులు రథాన్ని చేతులతో లాగడం ప్రారంభించారు. ఆ సమయంలో పైభాగంలో వేలాడుతున్న హైటెన్షన్ తీగను గమనించకపోవడంతో రథం తీగకు తగిలింది. వెంటనే నిప్పురవ్వలు చిమ్ముతూ రథాన్ని పట్టుకున్నవారంతా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఒక్కసారిగా కింద పడిపోయారు.

ప్రమాదంలో తొమ్మిది మంది విద్యుత్ షాక్‌కు గురయ్యారు. స్థానికులు వెంటనే సీపీఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐదుగురు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన నలుగురిలో ఓల్డ్ రామాంతపూర్‌కు చెందిన గణేష్‌ (25) పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కూడా ఈ ఉదయం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.

Image

మృతుల వివరాలు

విద్యుత్ షాక్‌తో మరణించినవారు – కృష్ణయాదవ్‌, సురేశ్‌ యాదవ్‌, శ్రీకాంత్‌ రెడ్డి, రుద్ర వికాస్‌, రాజేంద్ర రెడ్డి, గణేష్‌. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కుటుంబాల్లో తీవ్ర విషాదం

మృతుల ఇళ్లలో అంతటా కన్నీటి వాతావరణం నెలకొంది. సురేశ్ యాదవ్‌కు రెండేళ్ల క్రితం వివాహమై, నాలుగు నెలల చిన్న పాప ఉందని తెలిసింది. వేడుకల మధ్యలో ఇంటికి వచ్చి పాపతో ఆడుకున్న తరువాత మళ్లీ శోభాయాత్రకు వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. మరొక మృతుడు కృష్ణయాదవ్ (24) యాదవ సంఘం అధ్యక్షుడు రఘు కుమారుడు. ఆయన వారి వంశంలో ఏకైక వారసుడు కావడంతో కుటుంబ సభ్యులు తట్టుకోలేని షాక్‌కు గురయ్యారు. తండ్రి రఘు తన కళ్లముందే కొడుకు మరణించడాన్ని చూడలేక మానసికంగా కుంగిపోయారు.

స్పందించిన నేతలు

సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం పొందుతున్నారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందిస్తూ, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, రానున్న గణేష్ నిమజ్జనోత్సవాల ముందు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. హైటెన్షన్ వైర్లను సక్రమంగా పర్యవేక్షించి, వేలాడే తీగలను సరిచేయకపోతే ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగొచ్చని హెచ్చరించారు.

ఈ ఘటనతో కృష్ణాష్టమి వేడుకలు సంతోషం కన్నా విషాద వాతావరణంలో ముగిశాయి.

Also read: