భారతీయ సౌందర్యానికి మరో అంతర్జాతీయ వేదికలో గౌరవం తేవడానికి (Manika Vishwakarma) మణికా విశ్వకర్మ సిద్ధమవుతున్నారు. ఆగస్టు 18న జైపూర్‌లో నిర్వహించిన (Manika Vishwakarma) మిస్ యూనివర్స్ ఇండియా – 2025 పోటీల్లో మణికా విశ్వకర్మ విజేతగా నిలిచి ప్రతిష్ఠాత్మక కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాది టైటిల్ హోల్డర్ రియా సింఘా, మణికా తలకు కిరీటాన్ని అలంకరించారు.
ఈ ఏడాది నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున మణికా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్, మోహక్ థింగ్రా సెకండ్ రన్నరప్, హర్యానా అందగత్తె అమిషి కౌశిక్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
మణికా ప్రస్థానం
రాజస్థాన్‌లో జన్మించిన మణికా ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తూ, పోలిటికల్ సైన్స్‌లో ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నారు. ఆమె ఒక క్లాసికల్ డ్యాన్సర్ మాత్రమే కాకుండా, జాతీయస్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతేకాక చిత్రలేఖనంలో ప్రావీణ్యం కలిగిన మణికా, గత ఏడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు.
అందచందాలతో పాటు సమాజ సేవ పట్ల మణికాకు ఉన్న ఆసక్తి కూడా ప్రత్యేకం. ఆమె స్థాపించిన ‘న్యూరోనోవా’ అనే సంస్థ న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయం అందిస్తోంది.
మణికా స్పందన
తన విజయంపై మణికా భావోద్వేగంగా స్పందిస్తూ –
“నా ప్రయాణం నా స్వస్థలం గంగానగర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి ఈ పోటీకి సిద్ధమయ్యాను. మనపై మనం నమ్మకం పెట్టుకుంటే, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏదైనా సాధ్యమవుతుంది. ఈ విజయానికి వెనుక నన్ను ప్రోత్సహించిన ఎంతోమంది ఉన్నారు. అందరికీ నా కృతజ్ఞతలు” అని అన్నారు.
ఇక థాయ్‌లాండ్ వేదికగా జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలలో మణికా ప్రదర్శనపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
Also read:
- Nizamsagar: నిజాంసాగర్ వరద పరిస్థితి – 13 గేట్లు ఎత్తివేత
- Godhavari: ఎస్సారెస్పీ గేట్లు తెరుచుకున్నాయి

