ఇండియా కూటమి ఉపరాష్ట్ర అభ్యర్థిని బరిలోకి దింపనుంది. ఈ మేరకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందకూరు మండలం ఆకులమైలారం గ్రామానికి చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) పేరును ఖరారు చేసింది. ఎన్డీఏ తరఫున తమిళనాడుకు చెందిన మాజీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇండియా కూటమి కూడా దక్షిణాదికే ప్రాధాన్యం ఇచ్చింది. న్యాయకోవిదుడిగా పేరున్న సుదర్శన్ రెడ్డి పేరును ఎంపిక చేసింది. పలు కీలక తీర్పులను సైతం వెలువరించారు. గోవా మొదటి లోకాయుక్త చైర్మన్ గా కూడా సుదర్శన్ రెడ్డి సేవలందించారు. 1946 జూలై 8న జన్మించిన ఆయన న్యాయకోవిదుడిగా పేరు గాంచారు. హైదరాబాద్‌లోనే విద్యాభ్యాసం సాగింది. 1971లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు మరియు 1971లోనే న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.(Sudarshan Reddy) సీనియర్ న్యాయవాది శ్రీ కె. ప్రతాప్ రెడ్డి ఛాంబర్స్‌లో చేరారు. సిటీ సివిల్ కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ రకాల కేసుల్లో వాదనలు వినిపించారు. ఆగస్టు 8, 1988న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా, రెవెన్యూ శాఖ ఇన్చార్జ్గా నియమితులై జనవరి 8, 1990 వరకు కొనసాగారు. ఆ తర్వాత స్వల్ప కాలం పాటు కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 1993 జనవరి 8న హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లీగల్ అడ్వైజర్ గా, స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగానూ సేవలందించిన ఆయన పదవీ విరమణ పొందారు. 2024 డిసెంబర్ 14న హైదరాబాద్ లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మధ్యవర్తత్వ కేంద్రం (ఐఏఎంసీ) శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు.
Also Read:

