High Court: లైసెన్స్ లేకుంటే కేబుల్స్ కట్ చేయాలని ఆదేశం

HighCourt

హైదరాబాద్‌లో రామంతాపూర్‌లో జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపింది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఊరేగింపు రథానికి కేబుల్ వైర్లు తగలడంతో ఐదుగురు మృత్యువాత పడిన ఘటనపై (High Court) హైకోర్టు కఠిన వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రమాదం అనంతరం జీహెచ్‌ఎంసీ పరిధిలో లైసెన్స్ లేని కేబుళ్లను విద్యుత్ అధికారులు కట్ చేశారు. కానీ, తిరిగి కనెక్షన్లు ఇవ్వాలని ఎయిర్‌టెల్ సంస్థ (High Court) హైకోర్టులో పిటిషన్ వేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నాగేశ్ భీమపాక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడటం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. రామంతాపూర్ ఘటనలో తొమ్మిదేళ్ల బాలుడు బర్త్‌డే రోజే తండ్రికి తలకొరివి పెట్టాల్సి రావడం తనను తీవ్రంగా కలచివేసిందని జడ్జి పేర్కొన్నారు. కేకు కోయాల్సిన వయసులో తలకొరివి పెట్టడం సమాజానికి అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ ప్రమాదాల విషయంలో అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యతలు నెట్టేయడం సరైందికాదని హైకోర్టు ప్రశ్నించింది. “ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యులు? పసి హృదయం పగిలిపోయింది.. సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. చలన రహిత చట్టాలతో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడగలం?” అంటూ జస్టిస్ నగేశ్ ప్రశ్నించారు.

పిటిషనర్లు స్తంభాలపై కేబుల్స్ అధిక బరువు కారణంగా అవి ఒరిగిపోతున్నాయని వాదించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి “ఇది స్పష్టమైన నిర్లక్ష్యం. కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కేందుకు ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి” అని వ్యాఖ్యానించారు. నలుపు రంగులో ఉన్న వైర్లను గుర్తించలేకపోయామని న్యాయవాది చెప్పగా, “కరెన్సీ నోట్లపై గాంధీని మాత్రం బాగానే గుర్తుపడతారు” అని న్యాయమూర్తి చురకలంటించారు.

హైకోర్టు స్పష్టంగా పేర్కొంది: జీహెచ్‌ఎంసీ లైసెన్స్ తీసుకున్న కేబుళ్లను తప్ప ఇతర కేబుల్స్ నగరంలో అనుమతించరని. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఈ ఘటనతో కేబుల్ నెట్‌వర్క్ భద్రతపై ప్రజల్లో విస్తృత చర్చ మొదలైంది. అనుమతులు లేకుండా కేబుల్స్ వేయడం ప్రాణాంతకమని మరోసారి స్పష్టమైంది. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యమని హైకోర్టు గుర్తు చేసింది. ఇకపై అధికారులు, సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఇలాంటి విషాదాలు పునరావృతం కాకపోవని సమాజం కోరుకుంటోంది.

Also read: