హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నది (Balapur Laddu) బాలాపూర్ లడ్డూ. ప్రతి సంవత్సరం జరిగే ఈ లడ్డూ వేలంపాట తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా విశేష ఆకర్షణగా నిలుస్తుంది. 1980లో బాలాపూర్ గణేశ్ (Balapur Laddu) ఉత్సవ సమితి ఏర్పడగా, తొలిసారి 1994లో లడ్డూ వేలం ప్రారంభమైంది. ఆ మొదటి వేలంలో రైతు కొలను మోహన్ రెడ్డి రూ. 450కే లడ్డూను సొంతం చేసుకున్నారు. ఆ లడ్డూను ఆయన పొలంలో చల్లడంతో ఆ సంవత్సరంలో పంటలు బాగా పండడం, ఆర్థికాభివృద్ధి కలగడంతో లడ్డూ మహిమపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.
తదుపరి సంవత్సరాల్లో ఈ వేలం విశేష రీతిలో విస్తరించింది. 1995లో అదే మోహన్ రెడ్డి రూ. 4,500లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి వేలం మొత్తం వందల నుంచి లక్షల్లోకి పెరిగింది. కొలను కృష్ణారెడ్డి, కళ్లెం ప్రతాప్ రెడ్డి, చిగురింత బాల్ రెడ్డి, పన్నాల గోవర్ధన్, తీగల కృష్ణారెడ్డి, సింగిరెడ్డి జైహింద్ రెడ్డి, స్కైలాబ్ రెడ్డి, నాగం తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ గుప్తా, మర్రి శశాంక్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి వంటి పలువురు ప్రముఖులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. 2024లో కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డూను రూ. 30.01 లక్షలకు సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు.
లడ్డూ వేలం విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. వినాయక చవితి మొదటి రోజు నుంచే లడ్డూ కోసం దరఖాస్తులు స్వీకరించి, నిమజ్జన దినాన ఉదయం 7 గంటలకు వాటిని ముగిస్తారు. లడ్డూ వేలం రూ. 1,116తో ప్రారంభమై, అత్యధికం చెప్పిన వారికి లభిస్తుంది. వేలం గెలుచుకున్న వారు బాండ్ పై సంతకం చేసి వచ్చే ఏడాది చెల్లింపు చేయాలి.
లడ్డూ ద్వారా వచ్చిన మొత్తాన్ని బాలాపూర్ ఉత్సవ కమిటీ గ్రామాభివృద్ధి, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది. పాఠశాలలు, రహదారులు, దేవాలయాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఒకవైపు భక్తిశ్రద్ధతో, మరోవైపు సామాజిక సేవకు ఉపయోగపడే ఈ లడ్డూ వేలం ప్రతి సంవత్సరం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
భక్తుల నమ్మకం ప్రకారం బాలాపూర్ లడ్డూ దక్కించుకున్న వారి ఇంట్లో సిరిసంపదలు విరాజిల్లుతాయని, పసిడి పంటలు పండుతాయని విశ్వసిస్తున్నారు. అందుకే ప్రతి ఏడాది ఈ వేలంలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వినాయకుని ఆశీస్సులు, గ్రామాభివృద్ధి లక్ష్యాలు కలిసిన ఈ సంప్రదాయం భక్తి, భవ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తోంది.
Also read:
- Revanth : టీచర్లు బాగా పనిచేస్తేనే రెండోసారి సీఎం అవుతా
- Kamareddy : సెప్టెంబర్ 15న కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ సభ

