Vagdevi Labs: చర్లపల్లిలో 12 వేల కోట్ల డ్రగ్స్ కలకలం

Vagdevi Labs

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ముఠా అరెస్టుతో సంచలనం రేగింది. పేరుకు (Vagdevi Labs) లాబొరేటరీ అని చెప్పుకుంటూ నడుస్తున్న ఫ్యాక్టరీలో, లోపల మాత్రం అత్యంత ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ఘోర విషయం వెలుగులోకి వచ్చింది. చర్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఉన్న ఓ కెమికల్ (Vagdevi Labs) ఫ్యాక్టరీ ‘వాగ్దేవి ల్యాబ్స్’ పేరుతో నకిలీ లైసెన్స్ ఆధారంగా నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫ్యాక్టరీలో అధునాతన పరికరాలతో ఎండీ (మెఫెడ్రోన్) అనే నిషేధిత డ్రగ్స్ భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయని దర్యాప్తులో తేలింది.

Image

మహారాష్ట్రకు చెందిన మీరా-భయందర్, వసాయి-విరార్ (ఎంబీవీవీ) పోలీసులు కొన్నాళ్లుగా ఓ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు. గూఢచారులను రంగంలోకి దించి వారాల తరబడి రహస్య ఆపరేషన్ నిర్వహించారు. చివరికి ఆ ముఠా మూలాలు హైదరాబాద్‌లోని చర్లపల్లిలోనే ఉన్నాయని పక్కా సమాచారం సేకరించారు. ఆ తర్వాత స్థానిక పోలీసుల సహకారంతో ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, భారీ ఎత్తున డ్రగ్స్ తయారీకి వినియోగించే 32 వేల లీటర్ల రసాయనాలను కూడా సీజ్ చేశారు.

Image

ఈ దాడిలో ఫ్యాక్టరీ యజమాని, రసాయన శాస్త్ర నిపుణుడు శ్రీనివాస్, అతని సహచరుడు తానాజీ పాఠే, ఓ విదేశీయుడు సహా మొత్తం 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ప్రాథమికంగా 100 గ్రాముల ఎండీ డ్రగ్స్, రూ.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, ఈ ఫ్యాక్టరీలో ఉన్న ఆధునిక యంత్రాలు, భారీ ఉత్పత్తి యూనిట్లు కూడా సీజ్ చేశారు.

Image

పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. అంతకుముందు కూడా డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున రవాణా చేస్తూ పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి స్వాధీనం చేసుకున్న నిషేధిత పదార్థాల విలువ 12 వేల కోట్ల రూపాయలు ఉండటంతో కేసు అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది.

Image

ప్రస్తుతం నిందితులపై ఎన్‌డీపీ‌ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, కస్టడీకి తీసుకున్నారు. ముఠా వెనుక ఉన్న అంతర్జాతీయ లింకులు, సరఫరా మార్గాలు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ తయారీ యూనిట్ వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన డ్రగ్స్ నియంత్రణ వ్యవస్థలో ఇంకా కఠినమైన చర్యలు అవసరమని సూచిస్తోంది.

Also read: