Nepal: మంత్రులపై ప్రజల దాడులు

Nepal

నేపాల్‌ (Nepal) లో సోషల్ మీడియా బ్యాన్, అవినీతి ఆరోపణలపై జెన్–జెడ్ ఆధ్వర్యంలో మొదలైన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే పార్లమెంట్ భవనం, ప్రధాన మంత్రివారి నివాసం, (Nepal) మంత్రుల ఇండ్లు ధ్వంసానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు నేరుగా మంత్రులు, అధికార పార్టీ నేతలపై దాడులు ప్రారంభించారు.

Image

తాజా సమాచారం ప్రకారం, నిరసనకారులు వారిన్ మినిస్టర్ దంపతులపై దాడి చేశారు. అలాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ బిష్ణు ప్రసాద్ పౌడేల్ను ధుల్లో పరిగెత్తించి దారుణంగా కొట్టారు. ఆయన పారిపోతుండగా కూడా వెంటపడి కర్రలతో, రాళ్లతో చితకబాదారు. ఒక నిరసనకారి ఎగిరి తన్ని మరింత అవమానానికి గురిచేశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

ఇక మరోవైపు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన అనేక మంది నేతలు దేశం దాటిపోతున్నట్లు సమాచారం. వారిని ఆగ్రహంతో ఉన్న జనాలు లక్ష్యంగా చేసుకోవడంతో, రాజకీయ నాయకులు భద్రత కోసం రహస్య మార్గాల్లో దేశం విడిచి వెళ్తున్నారని వర్గాలు చెబుతున్నాయి.

ఇంతలో, రాజీనామా చేసిన ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామాను నేపాల్ ప్రెసిడెంట్ అధికారికంగా ఆమోదించారు. దీంతో దేశంలో ప్రధాని పదవి ఖాళీగా మారింది. కొత్త నాయకత్వంపై చర్చలు జరుగుతున్నప్పటికీ, సైన్యం పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

Image

నిరసనల నేపథ్యంలో ఇప్పటికే 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధాన నగరాలన్నింట్లో కూడా ఆర్మీని మోహరించారు. కాఠ్మాండు వీధుల్లో ట్యాంకులు, ఆర్మీ వాహనాలు సంచరిస్తుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

నేపాల్‌లో ప్రజలు చేస్తున్న ప్రధాన నినాదం – “అవినీతి ఆపు, సోషల్ మీడియాను కాదు”. ఈ నినాదం దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. సాధారణ ప్రజల జీవన విధానంలో భాగమైన సోషల్ మీడియాను నిషేధించడం పట్ల యువత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే కారణంగా రాజకీయ వర్గాలపై ఉగ్రరూపం దాల్చారు.

సాయంత్రం 04:04 గంటలకు (9th Sep 2025) నేపాల్ మీడియా అందించిన సమాచారం ప్రకారం, ఓలీ రాజీనామా ఆమోదించబడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు పాలనను సైన్యం పర్యవేక్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నేపాల్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు దక్షిణాసియా రాజకీయ వాతావరణాన్నే కుదిపేస్తున్నాయి. కొత్త నాయకత్వం ఎప్పుడు వస్తుందన్న దానిపై అన్ని కళ్లూ నిలిచాయి.

Also read: