కాళేశ్వరం అవినీతి కేసులో విచారణ ఆగిపోవడానికి బీజేపీ – బీఆర్ఎస్ మధ్య గోప్య ఒప్పందమే కారణమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (MaheshKumarGoud) తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, “48 గంటల్లో కాళేశ్వరం అవినీతిని తేలుస్తాం” అని మాటిచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు మౌనం ఎందుకు వహిస్తున్నారని (MaheshKumarGoud) ప్రశ్నించారు.
కాళేశ్వరం అవినీతిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. “కేటీఆర్ తన స్థాయి దాటి మాట్లాడుతున్నారు. దేశం కోసం అన్నీ త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి వ్యాఖ్యానించే స్థాయి ఆయనది కాదు” అని గౌడ్ మండిపడ్డారు.
విచారణ నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్, బీజేపీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక బీజేపీ నేతలే ఉన్నారని, ఉప రాష్ట్రపతి ఎన్నికలోనే బీఆర్ఎస్ నిజ స్వరూపం బయటపడిందని అన్నారు. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకుండా, పరోక్షంగా ఎన్డీయే వైపు మొగ్గు చూపిందని గౌడ్ స్పష్టం చేశారు.
కవిత వ్యాఖ్యలతోనే బీఆర్ఎస్ మానసికంగా బీజేపీలో విలీనం అయిందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తారని ప్రశ్నిస్తున్నవారు, కాళేశ్వరం అవినీతిపై మౌనం ఎందుకు వహిస్తున్నారని గౌడ్ ప్రతిప్రశ్నించారు.
కాళేశ్వరం కేసును సీబీఐకి ఇవ్వాలని కోరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పుడు స్పందించకపోవడం బీజేపీ నిజమైన వైఖరిని చూపుతోందని అన్నారు. ఇక, కోట నీలిమకు జారీ చేసిన నోటీసులు రాజకీయ కక్ష్యసాధింపులో భాగమేనని వ్యాఖ్యానించారు.
2017లోనే కోట నీటిమ కుటుంబం చిరునామా మార్చడానికి ఎన్నికల కమిషన్‌కు ఫామ్-6 సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు మాత్రం బీజేపీ ఒత్తిడికి లోనై ఈసీ నోటీసులు జారీ చేసిందని గౌడ్ ఆరోపించారు. ఈ కేసును తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.
మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ – బీఆర్ఎస్ సంబంధాలపై కొత్త చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కేసు, బీజేపీ మౌనం, బీఆర్ఎస్ వైఖరి రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రధాన ఎజెండాగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Also read:

