Pakistan: పాక్‌లో హింస.. కాల్పులు!

Pakistan

Pakistan)

(Pakistan) పాకిస్తాన్‌లో మరోసారి హింస చెలరేగింది. ఇజ్రాయిల్‌ దాడులకు వ్యతిరేకంగా, గాజా మరియు పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఇస్లామాబాద్‌ వైపు కదులుతున్న టీఎల్‌పీ (తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్) (Pakistan) కార్యకర్తలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన లాహోర్ సమీపంలోని మురిద్కే ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది.

సమాచారం ప్రకారం, నిరసనకారులపై పోలీసులు బలప్రయోగం చేయగా, టీఎల్‌పీ మద్దతుదారులు కూడా తిరగబడి దాడులు చేశారు. ఈ ఘర్షణలో ఒక పోలీస్‌ అధికారి మృతి చెందగా, అనేక మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. టీఎల్‌పీ చీఫ్‌ సాద్ రిజ్వీ కూడా కాల్పుల్లో గాయపడ్డారో లేదా మరణించారో అనే విషయంపై గందరగోళం కొనసాగుతోంది. కొన్ని స్థానిక మీడియా వర్గాలు అతనికి బుల్లెట్లు తగిలినట్లు పేర్కొంటున్నాయి.

పంజాబ్‌ పోలీసు చీఫ్‌ ఉస్మాన్‌ అన్వర్‌ మాట్లాడుతూ, “ఆందోళనకారులు ముందుగా భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దాంతో ప్రతిగా పోలీసులు స్పందించాల్సి వచ్చింది” అని తెలిపారు. అయితే ఎన్ని మంది ఆందోళనకారులు మృతి చెందినారన్న దానిపై ఆయన వ్యాఖ్యానించలేదు.

టీఎల్‌పీ పార్టీ గత శుక్రవారం నుంచి తమ ఆందోళనలను ప్రారంభించింది. ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబారి కార్యాలయం ముందు గాజా, పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శన చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టారు. అయితే ప్రభుత్వం ముందుగానే ఆందోళనకారులను నిలువరించేందుకు భారీగా పోలీసులు, పారామిలటరీ దళాలను మోహరించింది.

ఆదివారం తెల్లవారుజామున మురిద్కే ప్రాంతంలో పోలీసులు ఆందోళనకారులను చుట్టుముట్టి తరలించే ప్రయత్నం చేయగా, తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. లాహోర్‌, ఇస్లామాబాద్‌, పెషావర్‌ సహా పలు ప్రాంతాల్లో టీఎల్‌పీ మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొందరు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టగా, మరికొందరు రాళ్లతో దాడులు చేశారు.

ఈ హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతా దళాలను అలర్ట్‌లో ఉంచింది. ఇంటర్నెట్‌ సేవలను కొన్నిచోట్ల నిలిపివేసినట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా పాకిస్తాన్‌లోని రాజకీయ అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Also read: