(BC JAC) బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ (BC JAC) బీసీ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణలో నిర్వహించిన బంద్ ఘనవిజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు రోడ్లెక్కకపోవడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. షాపులు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడి, జనజీవనం పూర్తిగా స్థంభించింది.
ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పై మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
మంచిర్యాలలో మంత్రి వివేక్ వెంకటస్వామి, సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్‌లో మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో భారీ నిరసనలు జరిగాయి. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఖైరతాబాద్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్మించారు.
మంత్రులు సీతక్క, పొన్నం, వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, బీసీల కోసం అన్ని పార్టీల నేతలు ఒకే వేదికపైకి రావడం చరిత్రాత్మకమని అన్నారు. “బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటోంది బీజేపీయే, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం మా ప్రభుత్వ ధ్యేయం” అని వారు తెలిపారు.
ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి స్వయంగా రిజర్వేషన్లు అమలు కావని అసెంబ్లీలో చెప్పారు. బీసీలను మోసం చేస్తున్నారు. బీసీలు 52% ఉన్నా 42% అని తప్పుడు లెక్కలు చెబుతున్నారు. నేను అబద్ధం చెబుతున్నానంటే రాజకీయాల నుండి తప్పుకుంటా” అని అన్నారు.
బర్కత్ పురా, ఆర్టీసీ క్రాస్ రోడ్, మంచిర్యాల, సత్తుపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బంద్ ప్రభావం గట్టిగా కనిపించింది.
బీసీల ఐక్యతతో రాష్ట్రం మొత్తం ఒకే స్వరంలో మార్మోగింది.
Also read:

