ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన (Azharuddin) మహమ్మద్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని, తానేంటో దేశ ప్రజలందరికీ తెలుసునని (Azharuddin) ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా ఈ రోజు అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయన ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అజార్ స్పందిస్తూ, “తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవే తప్ప వాస్తవాధారాలు లేవు” అని తెలిపారు.
అజార్ మాట్లాడుతూ —
“నా జీవితమంతా ప్రజల ముందే గడిచింది. క్రికెటర్‌గా దేశానికి సేవ చేశాను. నాయకుడిగా ప్రజల కోసం పనిచేస్తున్నాను. నాకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదు. నేను ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే,” అని పేర్కొన్నారు.
తనపై ఉన్న కేసులపై కూడా ఆయన స్పందించారు. “నా మీద ఉన్న ఒక్క కేసులోనూ నేరం రుజువు కాలేదు. నా గురించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పూర్తి అవగాహన లేదు. వాస్తవాలను తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు,” అని అజార్ తెలిపారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. “పార్టీ హైకమాండ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ శాఖ ఇచ్చినా నిబద్ధతతో పని చేస్తాను. సీఎం ఏ శాఖ ఇవ్వాలో ఆయనే నిర్ణయిస్తారు,” అని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మాట్లాడుతూ — “కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. జూబ్లీహిల్స్‌లో గెలుపు ఖాయం. ప్రజలు కాంగ్రెస్‌పై విశ్వాసం ఉంచారు,” అని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో అజారుద్దీన్ చేరికకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ప్రతినిధిత్వం ఇచ్చే విధంగా, అలాగే మైనారిటీ వర్గం నుంచి మంత్రిత్వం ఇచ్చే అవకాశం కల్పించడం పట్ల పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రేవంత్ రెడ్డి కేబినెట్‌లో కొత్త శక్తి చేరినట్టే. క్రికెట్ కెరీర్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అజార్ ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేయాలని సంకల్పించారు.
Also read:
