తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి యాంకర్ (Shivajyothi) శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు మొదట చిన్న విషయంగానే కనిపించినప్పటికీ, కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. “తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం… రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే” అని (Shivajyothi) చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని హిందూ సంఘాలు మండిపడ్డాయి. పవిత్రమైన శ్రీవారి ప్రసాదంపై అలాంటి పదాలు వాడటం అసహనానికి గురిచేసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు

వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనకు గురవుతుండటంతో, శివజ్యోతి సోషల్ మీడియాలో ఓ వివరణాత్మక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో తన మాటలు తప్పుగా అర్థమైందని, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామి ప్రసాదాన్ని అవమానించలేనని స్పష్టం చేశారు. “నేను ‘రిచ్’ అన్నది రూ.10,000 ఎల్1 క్యూలైన్ల గురించి కాదు. కాస్ట్లీ క్యూలైన్లో నిలబడ్డామని మాత్రమే చెప్పాను. నా ఉద్దేశ్యం తప్పు కాదు… మాట తప్పిపోయింది” అని వివరణ ఇచ్చారు.
తాను గత నాలుగు నెలలుగా ప్రతీ శనివారం శ్రీవారి వ్రతాలు, ఆధ్యాత్మిక అంశాలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చెబుతూ వస్తున్నానని, తన భక్తి అందరికీ తెలుసని చెప్పారు. “నా జీవితంలో అత్యంత విలువైన బిడ్డ కూడా స్వామివారి ప్రసాదమే. స్వామి గురించి నేను ఎలా తప్పుగా మాట్లాడగలను?” అని భావోద్వేగంగా తెలిపారు.

అలాగే ఈ వివాదంలో తన సోదరుడు సోను కూడా అనుకోకుండా కొన్ని మాటలు మాట్లాడాడని, అతని తరఫున కూడా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. “కేసులు పెట్టేస్తారన్న భయంతో కాదు… నేను స్వయంగా కూడా మాట తప్పిపోయిందని ఫీలయ్యాను. అందుకే ఈ వీడియో పెట్టాను” అని ఆమె స్పష్టత ఇచ్చారు.

టీటీడీ సభ్యులు, శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు— తాను చెప్పిన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే హృదయపూర్వకంగా క్షమించమని ఆమె అభ్యర్థించారు. ఇకపై ఇలాంటి మాటలు తన నోటి నుండి రాకుండా జాగ్రత్తగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఆమె క్షమాపణలను కొంతమంది భక్తులు స్వీకరిస్తున్నప్పటికీ, మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. భక్తి, ఆధ్యాత్మికతకు సంబంధించిన వ్యాఖ్యలు చేసే ముందు పదేపదే ఆలోచించాలని సూచిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఆమెపై వ్యంగ్య కామెంట్లు, ట్రోలింగ్ కూడా కొనసాగుతోంది.

Also read:

