నల్గొండ జిల్లా అనుముల మండలం (Perur Village) పేరూరులో పంచాయతీ ఎన్నికలను గ్రామస్థులు పూర్తిగా బహిష్కరించడం పెద్ద సంచలనంగా మారింది. గ్రామ పంచాయతీకి, అలాగే వార్డుల రిజర్వేషన్‌కు సంబంధించి అధికారులు తీసుకున్న నిర్ణయం అన్యాయం చేస్తోందని (Perur Village) గ్రామస్థులు ఆరోపిస్తూ ఏకగ్రీవంగా ఎన్నికల్లో పాల్గొనబోమని ప్రకటించారు.
వివరాలకు వస్తే… ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా పేరూరు గ్రామ పంచాయతీని ఎస్టీ (మహిళ) రిజర్వేషన్‌గా కేటాయించారు. అంతేకాక గ్రామంలోని మొత్తం ఎనిమిది వార్డుల్లో నాలుగు వార్డులను కూడా ఎస్టీ వర్గానికి రిజర్వ్ చేశారు. అయితే వాస్తవానికి పేరూరు పంచాయతీ పరిధిలో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేని విషయం ప్రత్యేకంగా గుర్తించాల్సిందే.
ఈ రిజర్వేషన్‌లో అసలు సమస్య 2011 జనాభా లెక్కల నుంచి మొదలైంది. అప్పట్లో పేరూరు–వీర్లగడ్డ తండా కలిసి ఒకే గ్రామ పంచాయతీగా ఉండేవి. తర్వాత ప్రభుత్వం చేపట్టిన పంచాయతీ విభజనలో వీర్లగడ్డ తండాకు స్వతంత్ర గ్రామ పంచాయతీ హోదా కల్పించారు. అయితే ఈ ప్రక్రియలో వీర్లగడ్డ తండాకే చెందిన ఒక ఎస్టీ పురుష ఓటరును పొరపాటున ఇప్పటికీ పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే నమోదు చేశారు. ఈ ఒక్క తప్పు నమోదు ఆధారంగా అధికారులు “పేరూరులో ఎస్టీ జనాభా ఉంది” అనే తప్పుదారుణ నివేదిక పంపించడంతో, గ్రామ పంచాయతీ మొత్తాన్ని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ అన్యాయం మీద గ్రామస్థులు ఏకస్వరం వినిపించారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి గత నెల 28న హైకోర్టును ఆశ్రయించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా గ్రామంలో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ వేయలేదు. ఎన్నికలకు బహిష్కరణ తెలుపుతూ గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు కలిసి తీర్మానం చేశారు. పంచాయతీ ఆఫీస్ వద్ద విశేషంగా డబ్బు చాటింపు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ప్రస్తుతం గ్రామస్థులందరూ హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు తప్పును సరిదిద్దాలని, గ్రామం యొక్క వాస్తవ జనాభా వివరాల ఆధారంగా రిజర్వేషన్‌ను పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టు నిర్ణయం వచ్చే వరకు గ్రామంలో ఎన్నికల పట్ల పూర్తి అనిశ్చితి నెలకొంది.
Also read:

