భారత్–రష్యా దశాబ్దాల స్నేహం మరోసారి బలపడింది. ఉగ్రవాదాన్ని పూర్తిగా నశింపజేసే పోరాటంలో రెండు దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ (Modi–Putin) స్పష్టం చేశారు. ఢిల్లీలోని హైదరాబాదు హౌస్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ (Modi–Putin) పుతిన్‌తో సమావేశమైన అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు.
మోదీ మాట్లాడుతూ, పహాల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి పాకిస్థాన్ ఆధారిత జైషే మహ్మద్‌కు సంబంధం ఉన్నట్లు తేలినప్పుడు రష్యా భారత్‌కు ఇచ్చిన బలమైన మద్దతును గుర్తుచేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దానిని అణిచివేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు రష్యా ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
అదేవిధంగా, ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్ భూభాగంలో, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన చర్యలకు కూడా రష్యా పూర్తి మద్దతు తెలిపిన విషయం ఆయన ప్రస్తావించారు.
మోదీ మాట్లాడుతూ, “ఎనిమిది దశాబ్దాలుగా ప్రపంచం ఎన్నో మార్పులకు, సంక్షోభాలకు సాక్ష్యమైంది. కానీ భారత్–రష్యా స్నేహం మాత్రం ధృవతారలా నిలకడగా నిలిచింది. పరస్పర గౌరవం, నమ్మకం, విశ్వాసం మీద నిలబెట్టుకున్న ఈ బంధం కాలపరీక్షను ఎల్లప్పుడూ జయిస్తుంది” అని అన్నారు.
సమావేశంలో వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్యంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. షిప్పింగ్ రంగానికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే కొన్ని సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యాన్ని పుతిన్ వెల్లడించారు.
అదేవిధంగా, 2030 వరకు రెండు దేశాల మధ్య వాణిజ్య ప్రవాహాలకు మార్గనిర్దేశం చేసే ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ పై చర్చించినట్లు మోదీ తెలిపారు. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) విషయంలో వేగంగా ముందుకు సాగుతున్నామని కూడా చెప్పారు.
స్థానిక కరెన్సీల్లోనే పరస్పర చెల్లింపులు
సమావేశంలో పుతిన్ చేసిన ఒక వ్యాఖ్య అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. రష్యా–భారత్ వాణిజ్యంలో అమెరికా డాలర్‌పై ఆధారాన్ని తగ్గిస్తూ, రెండు దేశాలు తమ జాతీయ కరెన్సీల్లోనే పరస్పర చెల్లింపులు చేసే దిశగా ప్రయాణిస్తున్నట్లు పుతిన్ తెలిపారు.
ఈ వ్యాఖ్య, బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధారాన్ని తగ్గించే దిశగా కదులుతున్నాయన్న ప్రపంచ అంచనాలకు మరింత బలం ఇచ్చింది.
ఉక్రెయిన్ యుద్ధం కూడా చర్చాంశం
ఉక్రెయిన్–రష్యా యుద్ధం కూడా ప్రధాన అంశంగా సమావేశంలో చర్చించారు. యుద్ధానికి శాంతియుత పరిష్కారం కనుగొనే ప్రయత్నాల్లో భారత్ పోషిస్తున్న పాత్రకు పుతిన్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధం ముగింపుకు సంబంధించిన తన ప్రతిపాదనలను మోదీతో పంచుకున్నానని కూడా ఆయన వెల్లడించారు.
ప్రపంచానికి శాంతిని అందించే దేశంగా భారత్‌ఎప్పటికీ నిలిచిపోతుందనే తన వైఖరిని మోదీ మరోసారి స్పష్టం చేశారని పుతిన్ వ్యాఖ్యానించారు.
Also read:
