Flight Ticket: టికెట్ రేట్ల పెంపుపై కేంద్రం సీరియస్

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకున్న ఆకస్మిక సంక్షోభంతో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణం (Flight Ticket)  ఒక్కసారిగా ఖరీదైపోయింది. భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఇతర ఎయిర్‌లైన్స్‌ ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకొని (Flight Ticket) టికెట్ ధరలను ఏకంగా 8 నుంచి 10 రెట్లు పెంచి వసూలు చేస్తున్నాయి. ఈ అసాధారణ రేట్ల పెంపు దేశవ్యాప్తంగా మీడియా రిపోర్టులు, సోషల్‌ మీడియా పోస్టుల రూపంలో వైరల్‌ కావడంతో విషయం నేరుగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరింది. దీనిపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విమానయాన సంస్థలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

Image

దేశంలో విమాన చార్జీలకు కొన్ని నిర్దిష్ట పరిమితులు, చట్టబద్ధ మార్గదర్శకాలు ఉన్నాయని స్పష్టం చేసిన కేంద్రం, ఆ పరిమితులను అన్ని ఎయిర్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. సంక్షోభ సమయంలో ప్రయాణికులపై అధిక చార్జీలు విధించడం అనైతికమే కాకుండా చట్టపరంగా కూడా తగదని విమానయాన మంత్రిత్వశాఖ ప్రకటించింది.

Image

ఇండిగోలో సిబ్బంది అందుబాటులో లేకపోవడం, సాంకేతిక కారణాలు, షెడ్యూల్‌ సమస్యలు వంటి అంశాలతో వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రధానంగా సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్య అత్యవసర సేవల కోసం ప్రయాణించాల్సినవారు, ఉద్యోగ కారణాల కోసం ట్రావెల్‌ చేసే వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టులలో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. పైగా సర్వీసులు రద్దు అయ్యాయని ముందుగా సరైన సమాచారం అందకపోవడం, హెల్ప్‌డెస్క్‌ల వద్ద సహాయం అందకపోవడం ప్రయాణికుల అసహనాన్ని మరింత పెంచింది.

Image

తమకు సహాయం కోరినప్పుడు ఇండిగో సిబ్బంది తీరుపై చాలామంది ప్రయాణికులు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ‘‘క్షమాపణలు చెబుతాం కానీ చేయగలిగేది ఏమీ లేదు’’ అనే తరహాలో స్పందిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. “క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకోవడం సరిపోతుందా? మా సమయం, డబ్బు, అత్యవసర ప్రయాణం ఇవన్నీ ఎవరు భర్తీ చేస్తారు?” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Image

ఇకపోతే ఇండిగో విమానాలు రద్దయ్యిన నేపథ్యంలో ఇతర ఎయిర్‌లైన్స్‌ టికెట్ ధరలను అడ్డగోలుగా పెంచడం అత్యంత బాధ్యతారాహిత్యమని కేంద్రం పేర్కొంది. ‘‘ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ధరలను పెంచి దోపిడీ చేసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోము. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని విమానయాన శాఖ స్పష్టం చేసింది.

Image

కేంద్రం త్వరలోనే ఈ పరిస్థితిని నియంత్రించడానికి ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసి, ఎయిర్‌లైన్స్‌ ధరల విధానాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికులు నష్టపోకుండా, ఎయిర్‌లైన్స్‌ పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది.

Also read: