marburg virus: 8 మంది మృతి, 13 కేసులు నమోదు

దక్షిణ ఇథియోపియాలో మరింత ఆందోళన కలిగిస్తున్న (marburg virus) మార్బర్గ్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అత్యంత ప్రాణాంతకమైన ఈ వైరస్ ఇటీవల మళ్లీ ప్రబలుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన వివరాల ప్రకారం (marburg virus) మార్బర్గ్ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదిగా, అలాగే దీని మరణ రేటు 88 శాతం వరకు ఉండొచ్చునని పేర్కొంది. ప్రస్తుతం ఈ వైరస్‌కు ప్రత్యేకమైన చికిత్స లేదా టీకా అందుబాటులో లేనందున ముప్పు మరింత పెరిగినట్టయింది.

Image

ఇథియోపియా ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం డిసెంబర్ 3 నాటికి మొత్తం 13 కేసులు నమోదయ్యాయి. వీరిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ ప్రధానంగా అడవి జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉండటంతో పాటు, బాధితులతో సన్నిహితంగా ఉన్న వారికీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

Image

మార్బర్గ్ వైరస్ లక్షణాలు ప్రాథమిక దశలో సాధారణ జ్వరంలా కనిపిస్తాయి. కానీ కొద్ది రోజుల్లోనే రోగి పరిస్థితి తీవ్రతరం అవుతుంది. లక్షణాలుగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల్లో నొప్పులు, తీవ్రమైన అలసట, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో రక్తస్రావం కూడా జరుగుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దీన్ని గుర్తించడంలో ఆలస్యం అయితే రోగి ప్రాణాపాయం మరింత పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

Image

ఇథియోపియా ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసర చర్యలు తీసుకుంటోంది. బాధితులున్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలను పంపి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా చేపట్టాలని, అనుమానాస్పద ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

Image

పక్క దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యల కోసం WHO కూడా పర్యవేక్షణను పెంచింది. ప్రజా ఆరోగ్య నిపుణులు ఈ పరిస్థితిని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. మార్బర్గ్ వైరస్ ప్రమాదకరమైనది అయినప్పటికీ సరైన జాగ్రత్తలు, సమయానికి వైద్య సహాయం తీసుకుంటే ప్రాణాలను రక్షించే అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Image

ప్రస్తుతం ఇథియోపియా ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని ఆఫ్రికా దేశాల్లో గతంలో ఈ వైరస్ ప్రబలిన సందర్భాలు ఉన్నాయి. ఆ అనుభవాల ఆధారంగా ఇప్పుడు మళ్లీ ఆ దేశాలు కూడా పర్యవేక్షణ చర్యలను కట్టుదిట్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఈ వైరస్ వ్యాప్తిపై దగ్గరగా నిశితంగా గమనిస్తూ, భవిష్యత్తులో దాన్ని నియంత్రించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.

Also read: