(Telangana) రాష్ట్రంలో భూ పరిపాలన వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా మార్చే దిశగా (Telangana) తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, భూసర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి, భూభారతి పోర్టల్‌తో అనుసంధానం చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. భూ లావాదేవీలు, భూ వివరాలు, రికార్డుల నిర్వహణలో ఇప్పటివరకు ఉన్న లోపాలను తొలగించి, ప్రజలకు సులభమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.ఈ ఆధునీకృత భూ పరిపాలన వ్యవస్థను వచ్చే జనవరి నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే రైతులు, భూస్వాములు, క్రయవిక్రయదారులు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్క క్లిక్‌తో తమ భూములకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం లభించనుంది.
ఇవాళ నాంపల్లిలోని సీసీఎల్ఏ (Chief Commissioner of Land Administration) కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ నిర్వహణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా కార్పొరేట్ స్థాయికి దీటుగా ఉండాలని, ఆధునిక సౌకర్యాలతో సీసీఎల్ఏ కార్యాలయాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో మరోసారి కార్యాలయాన్ని తనిఖీ చేస్తానని, అప్పటికి మార్పులు కనిపించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.భూ రికార్డుల విషయంలో ఉన్న పాత సమస్యలపై కూడా మంత్రి దృష్టి సారించారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం వివిధ అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు సేకరించినప్పటికీ, ఇప్పటికీ కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తుల పేర్లపైనే కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. అలాంటి భూములన్నింటినీ సమీక్షించి, రికార్డుల్లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అసైన్డ్ భూములు, భూధాన్ భూములపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని సూచించారు.
రెవెన్యూ శాఖలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న విజిలెన్స్ కేసులపైనా మంత్రి సమీక్ష ప్రకటించారు. ఏ విభాగంలో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, అవి ఎందుకు పరిష్కారం కావడం లేదన్న అంశాలపై పూర్తి స్థాయి సమీక్ష చేస్తామని చెప్పారు. అలాగే కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత కేసులన్నింటినీ ఒకేచోట సమీక్షించి వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే తహసీల్దార్ కార్యాలయాలు ఒకే మోడల్లో ఉండేలా డిజైన్ రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు సౌకర్యవంతంగా, ఆధునిక వసతులతో ఈ కార్యాలయాలు నిర్మించాలన్నారు.భూభారతి పోర్టల్ ద్వారా రైతులకు సంబంధించిన భూముల పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నెంబర్‌కు ప్రత్యేక మ్యాప్, నాలా ఆర్డర్లు, ఆర్వోఆర్, గ్రామ నక్షాలు, ఫీడ్‌బ్యాక్ వంటి అన్ని వివరాలు ఒకే ప్లాట్‌ఫాంపై లభించనున్నాయి. ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే కావాల్సిన సమాచారం వెంటనే పొందవచ్చని మంత్రి తెలిపారు.క్రయవిక్రయదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సర్వే నెంబర్‌కు మ్యాప్ రూపొందించే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, సీసీఎల్ఏ ఇన్చార్జి కార్యదర్శి మంధా మకరంద్, ఎన్ఐసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also read:

