PrakashamDistrict: బతికున్న తల్లినే చంపినట్టు పత్రాలు…

PrakashamDistrict

(PrakashamDistrict) తల్లి బతికుండగానే ఆమెను చనిపోయినట్టుగా చూపించి, నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి భూమిని అమ్మేసుకున్న ఓ కొడుకు అక్రమాలు చివరకు వెలుగులోకి వచ్చాయి. (PrakashamDistrict) ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికారుల సకాలిక చర్యలతో వృద్ధురాలికి న్యాయం లభించింది.

ముండ్లమూరు మండలం కొమ్మవరం గ్రామానికి చెందిన విప్పల రమాదేవి (83)కి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఆమె గుంటూరులోని ఓ వృద్ధాశ్రమంలో జీవిస్తోంది. ఆమె భర్త ద్వారా 1995లో స్వగ్రామంలో సర్వే నెంబర్ 155/1లో 1.96 ఎకరాల వ్యవసాయ భూమి రమాదేవికి వచ్చింది. ఈ భూమి అప్పట్లో అధికారికంగా ఆమె పేరు మీద వెబ్‌ల్యాండ్‌లో నమోదు అయింది.

ఈ భూమిపై కన్నేసిన ఆమె కుమారుడు వేణుగోపాల్ రెడ్డి తల్లి ఆస్తిని అక్రమంగా సొంతం చేసుకోవాలని పక్కా ప్రణాళిక రచించాడు. కొంతమంది రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై, తల్లి చనిపోయినట్టుగా నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించాడు. ఆ పత్రాల ఆధారంగా భూమిని తన పేరుపైకి మార్చుకుని, 2024లో సోము చిన్న నాగిరెడ్డి అనే వ్యక్తికి విక్రయించాడు.

తనకు తెలియకుండానే భూమి అమ్మకం జరిగిందని తెలుసుకున్న రమాదేవి ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్నకు ఫిర్యాదు చేసింది. వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులు, కమిటీ సభ్యులు ఆమెకు అండగా నిలిచారు. వెంటనే ఇరుపక్షాలను పిలిపించి ఆర్డీవో విచారణ చేపట్టారు.

విచారణలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, అక్రమ భూమి బదలాయింపు, అమ్మకం అన్నీ నిర్ధారణ కావడంతో ఆర్డీవో కీలక ఉత్తర్వులు జారీ చేశారు. భూమి అమ్మకాన్ని రద్దు చేయాలని దర్శి సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. అలాగే వెబ్‌ల్యాండ్‌లో మళ్లీ రమాదేవి పేరును నమోదు చేయాలని స్పష్టం చేశారు.

అంతేకాదు సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం తల్లి సంరక్షణకు కుమారుడు ప్రతి నెల రూ.15 వేలు చెల్లించాలని ఆదేశించారు. ఈ అక్రమానికి సహకరించిన తహసీల్దార్, వీఆర్వోలపై చర్యలు తీసుకుంటామని, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపై కలెక్టర్‌కు నివేదిక పంపుతామని ఆర్డీవో వెల్లడించారు.

తల్లి ఆస్తి కొట్టేయాలన్న కొడుకు కుట్ర చివరికి బట్టబయలై, వృద్ధురాలికి న్యాయం జరిగింది. ఈ ఘటన అధికార వ్యవస్థలో జవాబుదారీతనంపై మరోసారి చర్చకు దారి తీసింది.

Also read: