(Tirumala) తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత పవిత్రమైన వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేసింది. ఈ నెల డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు (Tirumala) టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.
ఈ పది రోజులూ సమానంగా పవిత్రమైనవని, ఏ రోజు దర్శనం చేసుకున్నా ఒకే రకమైన పుణ్యఫలం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి వైష్ణవ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. ఈ సమయంలో శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారం తెరిచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో, రద్దీ నియంత్రణతో పాటు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ పటిష్టమైన ప్రణాళికను రూపొందించింది.
ఈ పది రోజుల కాలంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలిపి మొత్తం 7,70,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు ఈవో వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు చేరుకుంటే, రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఆలయంలో మూడు ప్రత్యేక ప్రవేశ మార్గాలను సిద్ధం చేసినట్లు చెప్పారు.
కేటాయించిన సమయానికి సరిగ్గా వచ్చే భక్తులను, క్యూలైన్‌కు సమీపంలో ఉన్న మార్గం ద్వారా నేరుగా పంపిస్తామని తెలిపారు. అదే సమయంలో ముందుగానే తిరుమలకు చేరుకున్న భక్తులను మరో రెండు మార్గాల గుండా క్యూలైన్‌లోకి తీసుకుని, వారికి కేటాయించిన సమయంలోనే దర్శనం కల్పిస్తామని వివరించారు. దీనివల్ల భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, క్రమబద్ధంగా దర్శనం పూర్తయ్యే అవకాశం ఉంటుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
ఈసారి తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పూర్తి స్థాయిలో వినియోగించనున్నారు. ఈ సెంటర్ ద్వారా తిరుమలలోని రద్దీని ముందుగానే అంచనా వేసి, భక్తులకు ప్రతి రెండు గంటలకు ఒకసారి కచ్చితమైన సమాచారం అందించనున్నారు. సర్వదర్శనం భక్తులు రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో ఆలయానికి వచ్చి, ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకునేలా మార్గనిర్దేశం చేయనున్నట్లు ఈవో తెలిపారు.
ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలకు ఈ ఏర్పాట్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. వారికి ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకుండా, సౌకర్యవంతంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్య సేవలు, వసతి సదుపాయాలు అన్నింటినీ భక్తుల అవసరాలకు అనుగుణంగా పెంచినట్లు తెలిపారు.
భక్తుల భద్రతపై కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. పోలీసు శాఖ, విజిలెన్స్, అగ్నిమాపక సిబ్బందితో కలిసి సమన్వయంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ పది రోజుల వ్యవధిలో మొత్తం 182 గంటల్లో 164 గంటలు పూర్తిగా సామాన్య భక్తులకే కేటాయించామని ఈవో గుర్తు చేశారు.
మిగిలిన కొద్ది సమయం మాత్రమే వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు కేటాయించినట్లు తెలిపారు. అంతేకాకుండా, ఈ పది రోజుల్లో ప్రివిలేజ్ దర్శనాలు, బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసి, నేరుగా వచ్చే అత్యవసర ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.
Also read:

