Delhi Police: ఆపరేషన్ ఆఘాత్ 3.0

Delhi Police

దేశ (Delhi Police) రాజధాని ఢిల్లీలో కొత్త ఏడాది వేడుకల సందడి మొదలవ్వకముందే, నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించారు ఢిల్లీ పోలీసులు. అర్థరాత్రి వేళ నగరమంతా ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీస్ బలగాలు… ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’ పేరుతో కరుడుగట్టిన నేరగాళ్లపై మృత్యుపాశం విసిరాయి. సామాన్య ప్రజలు నిద్రలో ఉండగా, నేరస్తుల స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి వందల మందిని అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.2026 కొత్త ఏడాది వేడుకలకు దేశ రాజధాని సిద్ధమవుతున్న తరుణంలో… శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా సౌత్ ఈస్ట్ ఢిల్లీ పోలీస్ (Delhi Police) విభాగం ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. నగరంలో ముందస్తుగా నేరాలను అరికట్టడం, ప్రజలకు భద్రతా భావన కల్పించడం, నేరగాళ్లను భయపెట్టడం ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యంగా పోలీసులు స్పష్టం చేశారు.

ఒకే రాత్రి… 285 మంది అరెస్ట్

ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం… ఈ ఒక్క రాత్రి ఆపరేషన్‌లో 285 మందిని అరెస్ట్ చేశారు. వీరిపై ఆర్మ్స్ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్, ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్, జూదం నిరోధక చట్టాలు వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదనంగా, పాత నేర చరిత్ర ఉన్నవారు, అనుమానాస్పదంగా కదులుతున్న వ్యక్తులు కలిపి 504 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.మొత్తం మీద రాత్రంతా సాగిన ఈ విస్తృత గాలింపులో 1,306 మందిని విచారించారు. వీరిలో నేర చరిత్ర ఉన్నవారిపై ప్రత్యేక నిఘా పెట్టి, భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా హెచ్చరికలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Image

ఆయుధాలు, డ్రగ్స్ భారీగా స్వాధీనం

‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’లో భాగంగా పోలీసులు గల్లీ గల్లీకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాటు తుపాకులు, కత్తులు, బ్లేడ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, యువతను మత్తులోకి నెట్టే భారీ మొత్తంలో డ్రగ్స్, మద్యంను కూడా పట్టుకున్నారు. డ్రగ్ పెడ్లింగ్, అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని పోలీసులు వెల్లడించారు.

Image

వేల మంది పోలీసులతో ఉక్కు భద్రత

ఈ ఆపరేషన్ కోసం వేలాది మంది పోలీసులు, ప్రత్యేక బృందాలు, క్రైమ్ టీమ్‌లు, బీట్ పోలీసులు పాల్గొన్నారు. రోడ్లపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల సహాయంతో నిఘా పెట్టారు. ముఖ్యంగా నేరాలకు కేరాఫ్‌గా మారిన ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు అధికారులు తెలిపారు.

కొత్త ఏడాది వేడుకలకు ముందస్తు హెచ్చరిక

కొత్త ఏడాది వేడుకల సమయంలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతోనే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. నేరగాళ్లకు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక అని, ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడదని ఈ చర్యల ద్వారా సందేశం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ప్రజల్లో భద్రతా భావన

ఈ భారీ ఆపరేషన్‌తో ఢిల్లీ ప్రజల్లో భద్రతా భావన పెరిగిందని పోలీసులు తెలిపారు. రాత్రివేళల్లో కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండటం, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Also read: