ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. అవసరమైతే తాను రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని, అలా వెళ్లినా మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ధైర్యం తనకు కార్యకర్తల అండతోనే వచ్చిందని స్పష్టం చేశారు. హిమాయత్‌నగర్ డివిజన్‌కు చెందిన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.దానం నాగేందర్ (Danam Nagender) మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రయాణం మొత్తం కార్యకర్తల కష్టంతోనే ముందుకు సాగిందన్నారు. “కార్యకర్తలే నా బలం. వారి నమ్మకంతోనే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ప్రజల్లో నాకు ఉన్న ఆదరణ, కార్యకర్తల విశ్వాసం వల్లే ఉపఎన్నిక వస్తే మళ్లీ గెలుస్తాననే నమ్మకం ఉంది” అని చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా.. ప్రజలతో నిజాయితీగా ఉంటే విజయం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
డిస్‌క్వాలిఫికేషన్ అంశంపై స్పష్టత
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో.. తనపై వస్తున్న విమర్శలకు దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను వెంటనే రాజీనామాకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది మాటలకే పరిమితం కాదని, అవసరమైతే కార్యరూపంలో చూపిస్తానని తెలిపారు. ఉపఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో స్పష్టమవుతుందన్నారు.
బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలు
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులపై దానం నాగేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వడం మరిచింది బీఆర్‌ఎస్ నేతలేనని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో సంబోధించడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని అన్నారు. “పదవికి గౌరవం ఇవ్వాలి. అది మరిచి విమర్శలు చేస్తే.. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది” అని హెచ్చరించారు.
కేటీఆర్‌కు సవాల్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా దానం నాగేందర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత విమర్శలు మానేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. “ప్రజలకు ఏం చేశారో, ఏం చేయలేకపోయారో మాట్లాడాలి. వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయాలు సాగవు” అని అన్నారు. మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకుని ఆపై ఇతరులపై మాట్లాడాలని సూచించారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందన
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇద్దరు రాష్ట్ర మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని చేసిన వ్యాఖ్యలపైనా దానం నాగేందర్ స్పందించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నారా? లేక రాష్ట్ర రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా? అన్న స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ పరిధిలోనే దర్యాప్తు సంస్థలు ఉంటాయని, అవినీతిపై ఆధారాలు ఉంటే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు.
ప్రజలే తుది తీర్పు చెబుతారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజల చేతుల్లోనే ఉందని దానం నాగేందర్ స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు ఎంత మాట్లాడినా.. చివరకు తీర్పు చెప్పేది ప్రజలేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే తమ బలమని, ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని చెప్పారు.
Also read:

