కామారెడ్డి జిల్లా కామారెడ్డి (Kamareddy) మండలం గర్గుల్ గ్రామంలో చోటుచేసుకున్న నాటుబాంబు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. (Kamareddy) ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గ్రామస్తుల్లో భయాందోళనలకు కారణమైంది. నాటుబాంబు పేలి ఓ వీధికుక్క దారుణంగా మృతి చెందడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
స్థానికుల కథనం ప్రకారం.. గర్గుల్ గ్రామానికి చెందిన మొగుళ్ల సాయాగౌడ్‌కు చెందిన పంటచేలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం సాయాగౌడ్ తమ్ముడు రామాగౌడ్ పంటచేలోకి నీళ్లు పారించేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన రామాగౌడ్, శబ్దం వచ్చిన దిశగా వెళ్లి పరిశీలించాడు.
అక్కడ ఓ వీధికుక్క తల పూర్తిగా పగిలి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి అతడు భయభ్రాంతులకు గురయ్యాడు. చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించగా నాటుబాంబు పేలిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంటచేలో నాటుబాంబులు పడేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
గ్రామస్తుల అంచనా ప్రకారం.. ఆ బాంబులను నోట పట్టుకోవడంతో అవి పేలి కుక్క తల పగిలి మృతి చెందిందని భావిస్తున్నారు. ఈ ఘటన కేవలం జంతువు మృతితోనే ఆగిపోలేదని, మానవ ప్రాణాలకు కూడా ముప్పుగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన వెనుక అడవి పందులను లేదా ఇతర జంతువులను తరిమికొట్టేందుకు నాటుబాంబులు ఉంచారా? లేక రైతులను భయపెట్టేందుకు, హాని చేయాలనే ఉద్దేశంతోనే గుర్తు తెలియని వ్యక్తులు ఈ పేలుడు పదార్థాలను పెట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంటచేలల్లో నాటుబాంబులు ఉంచడం చట్టవిరుద్ధమని, ఇది తీవ్రమైన నేరమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
బాధిత రైతు మొగుళ్ల సాయాగౌడ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. “మా పంటచేలో నాటుబాంబులు పెట్టడం వెనుక కుట్ర కోణం ఉండొచ్చు. ఇది మానవ ప్రాణాలకు కూడా ప్రమాదకరం” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇలాంటి ఘటన మునుపెన్నడూ జరగలేదని, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. నాటుబాంబులు ఎవరు పెట్టారు? వాటి లక్ష్యం ఏమిటి? అన్న అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో భయ వాతావరణం నెలకొంది. రైతులు, వ్యవసాయ కూలీలు పంటచేలల్లోకి వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నారు.
Also read:

