కేరళ రాజకీయాల్లో శబరిమల ఆలయం మరోసారి ప్రధాన అంశంగా మారింది. శబరిమల ఆలయంలో జరిగిన బంగారు దొంగతనం కేసుపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే శబరిమల ఆలయంలో జరిగిన బంగారు దొంగతనంపై సమగ్ర దర్యాప్తు జరిపించి, దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ (PM Modi) స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇది తన గ్యారెంటీ అని ఆయన తేల్చిచెప్పడం రాజకీయంగా కీలకంగా మారింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువనంతపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా శబరిమల ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని, అయితే ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యాయని తీవ్రంగా విమర్శించారు. శబరిమల బంగారు దొంగతనం కేవలం ఆస్తి నష్టం మాత్రమే కాదని, కోట్లాది భక్తుల విశ్వాసంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
కేరళలో ఈసారి ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాబోతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. తిరువనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అవినీతి, దుష్పరిపాలనకు విసిగిపోయారని అన్నారు. అధికారంలోకి రాగానే ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ అవినీతిని పూర్తిగా అంతం చేస్తామని, పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటివరకు కేరళ ప్రజలు రెండు వైపుల రాజకీయాలనే చూశారని, అవే రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశాయని ప్రధాని విమర్శించారు. ఒకవైపు ఎల్‌డీఎఫ్, మరోవైపు యూడీఎఫ్ మాత్రమే ఉన్నాయని, కానీ మూడవ వైపు కూడా ఉందని మోదీ అన్నారు. ఆ మూడవ దిశే అభివృద్ధి, సుపరిపాలన అని, అది కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కేరళ భవిష్యత్తును మార్చే శక్తి బీజేపీకే ఉందని పేర్కొన్నారు.
ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ పార్టీలు అవినీతి, దుష్పరిపాలన, బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడ్డాయని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం సంప్రదాయాలను, ఆలయాల పవిత్రతను కూడా తాకట్టు పెడుతున్నాయని విమర్శించారు. శబరిమల అంశమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే చట్టం ముందు అందరూ సమానమే అన్న విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు.
రాబోయే ఎన్నికలు కేరళ దిశను, దశను మార్చే ఎన్నికలుగా మారతాయని ప్రధాని మోదీ చెప్పారు. యువతకు ఉపాధి, మహిళలకు భద్రత, రైతులకు మద్దతు, ఆలయాల పరిరక్షణ అన్నీ బీజేపీ అజెండాలో భాగమని వివరించారు. శబరిమల బంగారు దొంగతనంపై నిజాలు బయటకు రావాల్సిందేనని, దోషులను జైలుకు పంపడం ద్వారా భక్తులకు న్యాయం చేయాల్సిందేనని మోదీ పునరుద్ఘాటించారు.
Also read:

