(Karnataka) కర్ణాటకలో బైక్ ట్యాక్సీల నిర్వహణపై గత కొంతకాలంగా కొనసాగుతున్న న్యాయ, పరిపాలనా వివాదానికి హైకోర్టు కీలక తీర్పుతో తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా బైక్ ట్యాక్సీలపై అమల్లో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ (Karnataka) కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యల తగ్గింపు, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బైక్ ట్యాక్సీల నిర్వహణకు అవసరమైన స్పష్టమైన నిబంధనలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.బైక్ ట్యాక్సీలను వాణిజ్య వాహనాలుగా గుర్తించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బైక్ ట్యాక్సీలు ఎల్లో నంబర్ ప్లేట్ (ఎల్లో బోర్డు)తోనే రోడ్డుపై తిరగాలని, ఇతర వాణిజ్య వాహనాలకు వర్తించే నియమాలు వీటికీ అమలులో ఉండాలని తెలిపింది. దీని ద్వారా ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రభుత్వానికి ఆదాయం వంటి అంశాలు సమతుల్యంగా ఉంటాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. బైక్ ట్యాక్సీలు పూర్తిగా నియంత్రణల లేకుండా తిరగడం కాకుండా, ఒక వ్యవస్థబద్ధమైన విధానంలో నడవాలన్నదే ఈ తీర్పు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
గతంలో బైక్ ట్యాక్సీల నిర్వహణను నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలవగా, విభు బక్రు, జస్టిస్ సీఎం జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ వాటిని విచారించింది. సింగిల్ బెంచ్ తీర్పును తోసిపుచ్చుతూ, సమకాలీన అవసరాలకు అనుగుణంగా బైక్ ట్యాక్సీల ప్రాముఖ్యతను గుర్తిస్తూ తాజా తీర్పును వెలువరించింది. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్, పెట్రోల్-డీజిల్ వినియోగం, కార్బన్ ఉద్గారాల పెరుగుదల వంటి సమస్యలకు బైక్ ట్యాక్సీలు ఒక పరిష్కారంగా నిలవగలవని కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రత్యేకంగా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో బైక్ ట్యాక్సీలు తక్కువ సమయంలో గమ్యానికి చేరుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయని, చిన్న దూర ప్రయాణాలకు ఇవి ఎంతో అనుకూలమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అలాగే, కరోనా తర్వాత ఉద్యోగ అవకాశాలు తగ్గిన నేపథ్యంలో అనేక మంది యువత, డెలివరీ పార్ట్‌నర్లు, ఫ్రీలాన్సర్లు బైక్ ట్యాక్సీలపై ఆధారపడుతున్నారని కోర్టు గుర్తించింది. ఉపాధి అవకాశాలను అడ్డుకోవడం కాకుండా, నియంత్రణలతో కూడిన స్వేచ్ఛ ఇవ్వడమే ప్రజాహితానికి అనుకూలమని తెలిపింది.ఈ తీర్పుతో రాపిడో, ఉబర్ బైక్, ఓలా బైక్ వంటి బైక్ ట్యాక్సీ సేవలపై ఆధారపడుతున్న వేలాది మంది డ్రైవర్లకు ఊరట లభించింది. అదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే బైక్ ట్యాక్సీల రిజిస్ట్రేషన్, లైసెన్సులు, భీమా, ప్రయాణికుల భద్రత, ఛార్జీల నియంత్రణ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నియమాలు అమలులోకి వస్తే బైక్ ట్యాక్సీ రంగం మరింత వ్యవస్థబద్ధంగా ఎదిగే అవకాశం ఉంది.
Also read:

