(USA) అమెరికాను భారీ శీతాకాల మంచు తుఫాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు తీవ్రంగా అస్తవ్యస్తమయ్యాయి. గత వారం రోజుల వ్యవధిలో దాదాపు 8 వేల విమానాలు రద్దు కావడంతో పాటు, వేల సంఖ్యలో ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. తీవ్ర వాతావరణ పరిస్థితులు విమానయాన వ్యవస్థను పూర్తిగా స్థంభింపజేశాయి.
(USA) న్యూయార్క్, చికాగో, బోస్టన్ వంటి ప్రధాన నగరాల్లో విస్తారంగా మంచు కురవడంతో విమానాశ్రయాల్లో కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రన్‌వేలు మంచుతో పూర్తిగా కప్పబడటంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వాటిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ప్రక్రియలు నిలిచిపోయాయి.
ఈ పరిస్థితుల కారణంగా వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. రద్దైన ఫ్లైట్స్, ఆలస్యాలు వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ప్రయాణికులు గంటల తరబడి, మరికొందరు రోజులపాటు విమానాశ్రయాల్లోనే నిరీక్షించాల్సి వచ్చింది.మంచు తుఫాను ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పరిస్థితులు మరింత కఠినంగా మారే సూచనలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర అవసరం ఉంటే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయవద్దని సూచనలు జారీ చేశారు. అలాగే, విమాన ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను ముందుగానే చెక్ చేసుకోవాలని, ఎయిర్‌లైన్స్ నుంచి వచ్చే సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.
Also read:
- Medaram: మేడారం జాతరలో భక్తుల భద్రతే లక్ష్యం..
- Ramagundam : రామగుండంలో 8 మంది మావోయిస్టుల లొంగుబాటు..

