హైదరాబాద్ (Hyderabad) నగర ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం సమగ్ర విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసిందని (Hyderabad) తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రసంగించారు.రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను మూడు ఎకనమిక్ జోన్లుగా విభజించాలనే నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ప్రతి జోన్‌లో కీలక రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయం, సేవారంగాల మధ్య సమతుల్యత సాధించే లక్ష్యంతో ఈ విభజన చేపడుతున్నామని వివరించారు. దీని ద్వారా పెట్టుబడులు ఆకర్షించి, ఉపాధి అవకాశాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.251 కోట్లు కేటాయించినట్లు గవర్నర్ వెల్లడించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ మేడారాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ నిధులు వినియోగిస్తామని చెప్పారు. మౌలిక వసతులు మెరుగుపరచడం ద్వారా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.రైతు సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు. రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. 26 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. ధాన్యానికి బోనస్ రూపంలో రైతులకు రూ.1,780 కోట్లను ప్రభుత్వం అందించిందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గర్వంగా పేర్కొన్నారు. ఇది రైతుల కష్టానికి దక్కిన గౌరవమని అన్నారు.
గతేడాది బతుకమ్మ పండుగ వేడుకలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాయని గవర్నర్ గుర్తు చేశారు. ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర మహిళల భాగస్వామ్యంతో ఈ విజయాన్ని సాధించగలిగామని చెప్పారు.విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని గవర్నర్ తెలిపారు. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్లుగా మార్చే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా మహిళలకు రూ.40 వేల కోట్ల రుణ సాయం అందించినట్లు వెల్లడించారు. మహిళలను పెట్రోల్ బంక్‌లు, ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లుగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ఇప్పటికే 200 కోట్ల ప్రయాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇది మహిళల ఆర్థిక, సామాజిక స్వేచ్ఛకు దోహదపడుతోందన్నారు.హైదరాబాద్ నగరంలో కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీ ద్వారా కాలుష్యాన్ని కలిగించే పరిశ్రమలను నగర పరిధి వెలుపలికి తరలించనున్నట్లు తెలిపారు. నగరాన్ని పర్యావరణహితంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Also read:

