బాలీవుడ్ లెజెండరీ నటుడు (Dharmendra)ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గౌరవం దక్కిన నేపథ్యంలో ఆయన భార్య, నటి, బీజేపీ నేత హేమ మాలిని భావోద్వేగంగా స్పందించారు. ఈ పురస్కారాన్ని స్వీకరించే సమయంలో (Dharmendra) ధర్మేంద్ర మన మధ్య లేకపోవడం తమ కుటుంబానికి తీరని లోటుగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు హేమ మాలిని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన మనసులోని మాటలను పంచుకున్నారు. ‘‘మా కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా ఉంది. ధర్మేంద్ర ఈ పురస్కారానికి పూర్తిగా అర్హుడు. అభిమానులు, సినీ పరిశ్రమకు చెందినవారు ఇప్పుడు ధర్మేంద్ర గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. అవన్నీ వింటుంటే మా హృదయాలు ఆనందం, గర్వంతో నిండిపోతున్నాయి’’ అని ఆమె పేర్కొన్నారు.
ధర్మేంద్రకు పద్మ విభూషణ్ రావాలని ఎన్నో ఏళ్లుగా అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకున్నారని హేమ మాలిని గుర్తు చేశారు. ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పనిచేయలేదని, తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే లక్ష్యంతోనే నిరంతరం శ్రమించేవారని తెలిపారు. నటుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగా కూడా ఎంతోమందికి ధర్మేంద్ర స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.
సుదీర్ఘ సినీ జీవితంలో ధర్మేంద్రకు జీవిత సాఫల్య పురస్కారాలు తప్ప ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా రాకపోవడం ఆశ్చర్యకరమని హేమ మాలిని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయన తన పనిపట్ల ఎప్పుడూ నిరాశ చెందలేదని, ప్రేక్షకుల ప్రేమే తనకు అతిపెద్ద అవార్డుగా భావించేవారని తెలిపారు.ఇంత గొప్ప పురస్కారాన్ని అందుకునే వేళ ధర్మేంద్ర మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని హేమ మాలిని అన్నారు.
ఆయనతో కలిసి పనిచేసిన నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులంతా కూడా ఇదే బాధను అనుభవిస్తున్నారని ఆమె భావోద్వేగంగా చెప్పారు. ధర్మేంద్ర చేసిన సేవలను దేశం గుర్తించిందనే విషయం తమకు కొంత ఓదార్పునిస్తోందని తెలిపారు.భారతీయ సినీ పరిశ్రమలో ధర్మేంద్రది ప్రత్యేక స్థానం అని, ఆయన నటన, వ్యక్తిత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని హేమ మాలిని పేర్కొన్నారు.
Also read:

