గంజాయి మాఫియాపై కఠినంగా వ్యవహరించాలంటే ఎక్సైజ్ సిబ్బందికి వెపన్స్ ఇవ్వాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ఎక్సైజ్ సిబ్బందికి ట్రైనింగ్ సమయంలో గన్ ఫైరింగ్ ఉంటుందని గుర్తు చేశారు. కానీ విధుల్లో ఉన్నప్పుడు వారికి వెపన్స్ ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం (Kavitha) చేశారు.
వెపన్స్ లేకుండా మాఫియాను ఎదుర్కోవడం చాలా ప్రమాదకరమన్నారు. ఎక్సైజ్ సిబ్బంది వద్ద ఆయుధాలు ఉంటే గంజాయి, డ్రగ్స్ మాఫియాకు భయం ఏర్పడుతుందన్నారు. అప్పుడే అక్రమ వ్యాపారాలపై నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.
నిజామాబాద్‌కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని కవిత భరోసా ఇచ్చారు. ఆమె పరిస్థితి కొంత క్రిటికల్‌గా ఉన్నప్పటికీ ఇప్పుడు కాస్త ఇంప్రూమెంట్ ఉందన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్యను కవిత పరామర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను చంపే స్థాయికి గంజాయి బ్యాచ్ వెళ్లిందంటే ప్రభుత్వంపై వారికి ఏ మాత్రం భయం లేదని స్పష్టమవుతోందన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. డ్రగ్స్, గంజాయి ఫ్రీ రాష్ట్రంగా మారుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఆ హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయన్నారు. ఇప్పుడు గ్రామాల్లో కూడా గంజాయి, డ్రగ్స్ చాలా ఈజీగా దొరుకుతున్నాయని ఆరోపించారు.
స్కూల్ పిల్లల వరకు ఈ మత్తు పదార్థాలు చేరుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్‌లలోకే గంజాయి, డ్రగ్స్ తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరమైన పరిణామమన్నారు. డ్రగ్స్, గంజాయి కారణంగానే గృహహింస ఘటనలు పెరుగుతున్నాయని చెప్పారు. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల ప్రభావంతో యువత దారి తప్పుతోందన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎక్సైజ్ సిబ్బంది ప్రాణాలతో పోరాడుతున్నారని చెప్పారు. వారికి కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వెపన్స్ లేకుండా మాఫియాను ఎదుర్కోవడం అన్యాయమన్నారు.
ఎక్సైజ్ సిబ్బంది ధైర్యంగా పనిచేయాలంటే వారికి పూర్తి భద్రత అవసరమన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇలాంటి దాడులు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు.
సౌమ్య ఘటన ప్రభుత్వం కళ్లుతెరిపించాల్సిన సంఘటనగా భావించాలన్నారు. ఇకనైనా డ్రగ్స్, గంజాయి మాఫియాపై నిజమైన యుద్ధం ప్రారంభించాలని సూచించారు. ఎక్సైజ్ శాఖను బలోపేతం చేయకపోతే సమాజం తీవ్రంగా నష్టపోతుందన్నారు.
Also read:

