ఇకపై ఆధార్ (Aadhar) కార్డులో చిరునామా మార్పు కోసం మీ సేవ కేంద్రాలు, ఆధార్ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం పూర్తిగా తొలగిపోనుంది. మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలన్నా, ఇతర చిన్నపాటి ఆధార్ సేవల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితికి చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న డిజిటల్ అవసరాలకు అనుగుణంగా (Aadhar) ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో, ఆధునిక ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ఇవాళ అధికారికంగా లాంచ్ చేసింది.
ఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర సమాచార, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ కొత్త ఆధార్ యాప్‌ను దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధార్ వ్యవస్థను మరింత సురక్షితంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చడమే ఈ యాప్ లక్ష్యమని తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్‌లో భాగంగా ఈ యాప్ ఒక కీలక మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు.
ఈ కొత్త ఆధార్ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే ఆధార్ వెరిఫికేషన్‌ను తక్షణమే చేసుకోవచ్చు. ఇక ఆధార్ కార్డును ఫిజికల్‌గా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆధార్ కాంటాక్ట్ కార్డు ఫీచర్ ద్వారా తమ వివరాలను సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఆధార్ వివరాలను షేర్ చేసుకునే అవకాశం కూడా ఈ యాప్‌లో ఉంది. ముఖ్యంగా, పూర్తి ఆధార్ వివరాలు కాకుండా అవసరమైన సమాచారం మాత్రమే కనిపించేలా షేర్ చేయడం ద్వారా వ్యక్తిగత గోప్యతకు అధిక ప్రాధాన్యత కల్పించారు.
ఈ యాప్‌లో మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే, ఒకే యాప్‌లో ఐదుగురు వరకు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునే అవకాశం కల్పించడం. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను ఒకే మొబైల్లో నిర్వహించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది. పిల్లలు, వృద్ధులు ఆధార్ సేవల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కుటుంబ సభ్యులే ఈ యాప్ ద్వారా అవసరమైన మార్పులు చేసుకునే సౌకర్యం లభించనుంది.
ఇక ఆధార్‌లో అడ్రస్ మార్పిడి, కాంటాక్ట్ వివరాల అప్డేట్ వంటి సేవలు ఈ యాప్ ద్వారా చాలా సులభంగా చేయవచ్చని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఆధార్ సేవలను కూడా ఈ యాప్‌లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. డేటా భద్రతకు అత్యున్నత స్థాయి రక్షణ చర్యలు తీసుకున్నామని, ఆధార్ సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుందని యూఐడీఏఐ అధికారులు స్పష్టం చేశారు.
గమనార్హమైన విషయం ఏమిటంటే, 2009లో ఇదే రోజున ఆధార్ కార్డును దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించారు. అదే రోజున ఆధార్‌కు సంబంధించిన ఈ ఆధునిక యాప్‌ను లాంచ్ చేయడం ఒక చారిత్రక సందర్భంగా మారింది. ఆధార్ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఇది గుర్తింపు సాధనంగా మారింది. ఇప్పుడు ఈ కొత్త యాప్‌తో ఆధార్ సేవలు మరింత స్మార్ట్‌గా, వేగంగా, ప్రజలకు దగ్గరగా మారనున్నాయి.
Also Read:

