తెలంగాణ రాష్ట్రానికి ఆరాధ్య దైవమైన వరాల తల్లి సమ్మక్క(Sammakka) నేడు వనాన్ని వీడి భక్తుల మధ్యకు రానున్నారు. మేడారం మహాజాతరలో అత్యంత పవిత్రమైన ఘట్టాల్లో ఒకటైన కంకవన పూజలు ఈరోజు ఉదయమే ఘనంగా ప్రారంభమయ్యాయి. (Sammakka) గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఐదో గొట్టు పూజారులు సంప్రదాయబద్ధంగా వనమహోత్సవ పూజను నిర్వహించారు.
ఉదయాన్నే దేవునిగుట్ట నుంచి డప్పు చప్పుళ్లు, పూనకాల మధ్య కంకవనాన్ని గజ్జల ప్రాంతానికి తీసుకువచ్చారు. వెదురు వనాన్ని సూచించే ఈ కంకవనం సమ్మక్క తల్లికి ప్రతీకగా భావిస్తారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ప్రకారం పూజారులు శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి కంకవనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు.
కంకవన పూజలు పూర్తవడంతో మధ్యాహ్న సమయంలో సమ్మక్క తల్లిని తీసుకురావడానికి చిలుకలగుట్టకు వెళ్లేందుకు పూజారులు సమాయత్తమవుతున్నారు. చిలుకలగుట్ట ప్రాంతం నుంచి తల్లి జనంలోకి వచ్చే ఈ ఘట్టం మేడారం జాతరలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టంగా భక్తులు భావిస్తారు. అమ్మ అడుగుపెట్టబోయే ప్రతి క్షణాన్ని భక్తులు శ్వాస ఆపుకొని ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా, సమ్మక్క తల్లి ఇవాళ రాత్రికి గద్దెపైకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో ముందురోజే ప్రధాన పూజారులు మేడారంలోని సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి జాతరలోని గద్దెల వద్దకు చేరుకుని సంప్రదాయ పద్ధతుల్లో పూజలు కొనసాగించారు. అమ్మల ఆరాధనలో భాగంగా గద్దెల వద్ద నిర్వహించిన ఈ పూజలు భక్తుల్లో మరింత భక్తి పారవశ్యాన్ని కలిగించాయి.
అనంతరం మేళతాళాలు, డప్పు సప్పులతో ప్రధాన పూజారి సిద్ధమైన మునిందర్ కొక్కెర కృష్ణయ్యతో పాటు ఇతర పూజారులు, భక్తులు సామూహికంగా సమ్మక్క గుడికి తరలి వెళ్లారు. ఈ సమయంలో మేడారం అడవులంతా డప్పు చప్పుళ్లతో, భక్తుల జయజయధ్వానాలతో మారుమ్రోగిపోయింది. గిరిజన నృత్యాలు, సంప్రదాయ వేషధారణ ఈ కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి.
సమ్మక్క తల్లి వనాన్ని వీడి జనంలోకి వచ్చే ఈ ఘట్టం గిరిజన సంస్కృతి, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తోంది. అమ్మ దర్శనంతో తమ కష్టాలు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని భక్తులు అపార విశ్వాసంతో మేడారానికి తరలివస్తున్నారు. మేడారం మహాజాతర సందర్భంగా అమ్మల ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.
Also read:
- Medaram Jatara: మేడారం గద్దెపైకి కొద్ది సేపట్లో వరాల తల్లి సమ్మక్క
- Medaram: ఉచిత బస్సులు, 4 వేల ప్రత్యేక సర్వీసులు

