Medaram: చెల్లని వీవీఐపీ, వీఐపీ పాసులు

Medaram

మేడారం (Medaram) మహాజాతరలో ఒక్కసారిగా పరిస్థితి చేయి దాటింది. సమ్మక్క తల్లి నిన్న రాత్రి గద్దెపైకి చేరిన అనంతరం గంటగంటకూ పరిస్థితి మారిపోయింది. లక్షలాది మంది భక్తులు ఒకేసారి మేడారానికి పోటెత్తడంతో ఆలయ పరిసరాలు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. (Medaram)ఈ క్రమంలో క్రౌడ్ మేనేజ్మెంట్‌లో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

Image

అర్థరాత్రి నుంచి ప్రధాన ద్వారం, క్యూలైన్లు, హరిత హోటల్ ప్రాంతం వరకు భక్తులతో నిండిపోయింది. పిల్లాపాపలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర అవస్థలు పడ్డాయి. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి దర్శనం కోసం ఎదురుచూడాల్సి రావడంతో భక్తుల్లో ఆందోళన పెరిగింది. భక్తులకు దర్శనం కల్పించే క్రమంలో క్యూలైన్ల నిర్వహణ సరిగా లేకపోవడం ఇబ్బందులకు దారి తీసింది.

ఒక దశలో ఆలయ పరిసరాల్లో భారీగా కోలాహలం నెలకొంది. కొంతమంది భక్తులు ఆందోళనకు దిగినట్లు సమాచారం. ముఖ్యంగా వీఐపీ, వీవీఐపీ వాహనాలు క్రౌడ్ మధ్యలోకి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు వీఐపీ వాహనాలను అడ్డగించి, వాహనాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది.

సమ్మక్క తల్లి గద్దెపైకి చేరిన దాదాపు పది గంటల నుంచి ప్రధాన ద్వారం వద్ద క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. హరిత హోటల్ వరకు భక్తుల వరుసలు విస్తరించాయి. ఈ నేపథ్యంలో హరిత హోటల్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, ఆర్టీసీ క్యూలైన్ల వైపు జంపన్న వాగు నుంచి వచ్చే భక్తులను డైవర్ట్ చేశారు. అయితే ఈ డైవర్షన్ కూడా సరిగా అమలు కాకపోవడంతో గందరగోళం మరింత పెరిగింది.

ఈ సమయంలో వీఐపీ, వీవీఐపీ పాసులు చెల్లవని భక్తులు స్పష్టంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇవన్నీ ఎందుకు ఇచ్చారు?” అంటూ అధికారులను నిలదీశారు. వీఐపీ క్యూ లైన్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డులను భక్తులు తొలగించారు. దర్శనం విషయంలో అందరికీ సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ గందరగోళంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కూడా చిక్కుకున్నారు. ఒక దశలో ఆయన కాన్వాయ్‌తో సహా భక్తుల నడుమ ఇరుక్కుపోయారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కారు దిగి కాలినడకన ముందుకు వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన పరిస్థితి ఎంత అదుపు తప్పిందో స్పష్టంగా చూపిస్తోంది.

మరోవైపు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నిర్వహణ లోపాలపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇంత పెద్ద మహాజాతరలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. భక్తులకు కనీస సౌకర్యాలు కూడా సక్రమంగా కల్పించలేకపోయారని అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

మేడారం మహాజాతర భక్తిశ్రద్ధలతో సాగే పండుగగా పేరొందినప్పటికీ, ఈసారి నిర్వహణ లోపాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. వీఐపీ సంస్కృతి, అసమర్థమైన క్రౌడ్ మేనేజ్మెంట్ వల్ల సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితిని వెంటనే నియంత్రించకపోతే మరింత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read: