ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర వైభవంగా ముగిసింది. జనవరి 28 నుంచి జనవరి 31 వరకు నాలుగు రోజుల పాటు గద్దెలపై కొలువైన అమ్మవార్లు లక్షలాది మంది భక్తులకు దర్శనం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిలువెత్తు బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్లా పాపలను చల్లగా చూడాలని, కుటుంబాలకు శుభం కలగాలని అమ్మవార్లను వేడుకున్నారు.ఈ మహా జాతరకు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు భక్తుల నుంచి కూడా విశేష స్పందన లభించింది. కొందరు ప్రత్యేకంగా విమాన టికెట్లు బుక్ చేసుకుని మరీ మేడారం జాతరకు హాజరయ్యారు. అయితే ఉద్యోగాలు, ఇతర కారణాల వల్ల భారత్‌కు రాలేని కొందరు భక్తులు (USA) విదేశాల్లోనే సమ్మక్క–సారలమ్మ జాతరను నిర్వహించడం విశేషంగా మారింది. తాజాగా ఇదే విషయానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(USA) ‘అమెరికాలో సమ్మక్క–సారక్క జాతర’ అనే పేరుతో కొందరు యువత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అమ్మవార్లకు అత్యంత ఇష్టమైన బంగారం అయిన బెల్లాన్ని సమ్మక్క, సారలమ్మలుగా ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. జాతరలో చేసే సంప్రదాయ కట్టువులను అక్కడ కూడా పాటించారు. మద్యం సాక పోయడం, మాంసాహారం సమర్పించడం, దీపధూప నైవేద్యాలు పెట్టి తమను చల్లగా చూడాలని అమ్మవార్లను వేడుకోవడం వీడియోలో కనిపించింది.
పూజా కార్యక్రమాల అనంతరం యువతీ, యువకులంతా ఒకే చోట కూర్చొని సామూహిక భోజనాలు చేసిన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. అమెరికా గడ్డపై సంప్రదాయబద్ధంగా సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహించడాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది సంస్కృతి, సంప్రదాయాలపై ఉన్న అభిమానానికి నిదర్శనమని ప్రశంసిస్తే, మరికొందరు ఎంతో భక్తిశ్రద్ధతో నిర్వహించారని కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్‌గా మారింది. దేశం దాటినా, ఖండాలు మారినా సమ్మక్క–సారలమ్మలపై భక్తి మాత్రం మారలేదని ఈ వీడియో స్పష్టంగా చూపిస్తోంది. మేడారం జాతర ప్రాధాన్యత ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరిందని చెప్పేందుకు ఇదే ఉదాహరణగా నిలుస్తోంది.
Also read:

