కనులపండువగా నారసింహుడి కల్యాణం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నారసింహుని కల్యాణం మంగళవారం వైభవంగా జరిగింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కల్యాణ మహోత్సవం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ జీలకర్ర, బెల్లం, కన్యాదానం, పాద ప్రక్షాళన కార్యక్రమాలతో వివాహ తంతును శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్చకులు, వేదపండితుల తలంబ్రాల వేడుకను నేత్రపర్వంగా జరిపించారు.

స్వామివారి కరుణా కటాక్షాలు అమ్మవారితో పాటు సమస్త లోకాలకు సంతరిస్తాయని వివరించారు. భక్తుల “నమో నారసింహ, జై నారసింహ, గోవిందా” నామస్మరణతో యాదగిరి కొండ మార్మోగింది. నరసింహస్వామి కల్యాణం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభతో , ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ఆలయానికి పట్టువస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

నేడు దివ్యవిమాన రథోత్సవం

మంగళవారం రాత్రి లక్ష్మీదేవిని పెండ్లాడిన నార సింహుడిని బుధవారం ఉ. 9 గంటలకు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగించనున్నారు. రా. 7 గంటలకు ముఖ్య ఘట్టమైన దివ్య విమాన రథోత్సవాన్ని జరుపనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే సిద్ధం చేశారు.