K Kavitha : కవిత అరెస్టు అక్రమం కాదు

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (K Kavitha)అరెస్టు అక్రమం కాదని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. అరెస్టుకు అనుమతించడం అనేది తన పరిధిలోని అంశమని కోర్టు తెలిపింది. లిక్కర్ స్కాంలో అవినీతిపై నిన్న ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అక్రమమని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేశారని, ప్రాథమిక హక్కులు ఉల్లంఘించారని కవిత తరఫు అడ్వొకేట్ చేసిన వాదనను కోర్టు తప్పు పట్టింది. కోర్టునే ప్రశ్నించేలా కౌంటర్ దాఖలు చేయొద్దని సూచించింది. కౌంటర్ గా సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తాము కవితను చట్టబద్ధంగానే అరెస్టు చేశామని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎక్కడా జరగలేదని తెలిపింది. అరెస్టుకు ఒక రోజు ముందే కవితకు సమాచారం ఇచ్చామని వివరించింది. ఇదిలా ఉండగా.. సీబీఐ తనను ప్రశ్నించవద్దని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై మధ్యాహ్నం తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా ఈ కేసులో కవితను ప్రశ్నించేందుకు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ వేసిన పిటిషన్ పై మధ్యాహ్నం తర్వాతే వాదనలు కొనసాగించాలని సూచించింది.

కవితే కీలక సూత్రధారి
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితే (K Kavitha)కీలక సూత్రధారి అని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆమె రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సేకరించి ఆప్ నేతలకు పంపారని పేర్కొన్నారు. విజయ్ నాయర్ మరికొందరితో కలిసి కవిత స్కెచ్ వేశారని అన్నారు. ఇండో స్పిరిట్ కంపెనీలో కవితకు 33% వాటాలున్నాయని తెలిపారు. లిక్కర్ పాలసీలో భాగంగా శరత్ చంద్రారెడ్డికి అలాట్ చేసిన ఐదు జోన్లకు సంబంధించి 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ఇందుకు శరత్ చంద్రారెడ్డి ఒప్పుకోకపోవడంతో ఆయనను కవిత బెదిరించారని తెలిపారు. కవిత పీఏ కౌశిక్ వాంగ్మూలాన్నీ రికార్డు చేశామని, అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు ఆప్ నేతలకు భారీ మొత్తంలో డబ్బులు అందాయని తేలిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ సంభాషణలనూ కోర్టుకు అందజేస్తామని తెలిపారు. తాము దాఖలు చేసిన చార్జి షీట్ లో అనేక అంశాలను ప్రస్తావించడంతోపాటు సాక్ష్యాలను కూడా చూపామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్రమ మార్గాల ద్వారా వచ్చిన డబ్బుతో ఆమె మహబూబ్ నగర్ లో భూములు కొనుగోలు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న కవితను విచారిస్తే మరిన్ని నిజాలు బయటికి వస్తాయని చెప్పారు. ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు మధ్యాహ్నం తర్వాత కస్టడీపై వాదనలు కొనసాగించాలని సీబీఐ తరఫు న్యాయవాదికి సూచించారు.

 

Also read:

Kavitha : సీబీఐ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత

Telangana Jagruthi : తెలంగాణ జాగృతికి రూ. 80 లక్షలు