siddarameshwara : దక్షిణ కాశీగా భాసిల్లుతున్న భిక్కనూరు సిద్ధరామేశ్వరస్వామి(siddarameshwara) స్వయం భూలింగ మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అందె మహేందర్ రెడ్డి తెలిపారు.
భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. శనివారం ప్రారంభమయ్యే ఉత్సవాలు 15వ తేదీ బుధవారంతో ముగుస్తాయని చెప్పారు. శనివారం రోజు స్వామి వారి పల్లకీ సేవ నిర్వహించనున్నారు. గంగా, భువనేశ్వరీ సమేత సిద్ధరామేశ్వరుడి ఉత్సవ మూర్తిని ప్రధాన ఆలయం నుంచి కుమ్మర్ గల్లీలోని సిద్ధగిరి రామగిరి యోగి పుంగవులు సమాధి మందిరం వరకు పల్లకీలో తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు.

పుర వీధుల గుండా ఊరేగే స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. పల్లకీ కింది నుంచి వెళితే గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సేవ సాగుతున్న దారి వెంట భక్తులు పల్లకీ కింది వైపు నుంచి వెళ్లేందుకు బారులు తీరుతారు. శనివారం సాయంత్రం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆదివారం అలంకరించిన బండ్లు స్వామి వారి ప్రధాన ఆలయం చుట్టూ తిరుగుతాయి. వివిధ గ్రామాల నుంచి రైతులు బండ్లను అలంకరించుకొని ఆలయానికి తీసుకు వస్తారు. పెద్దకాపు(కుమ్మరి) బండి ముందు నడుస్తుంటే మిగతా బండ్లు దానిని అనుకరిస్తాయి.
సోమవారం ఉదయం సిద్ధరామేశ్వర ఆలయ మహంతు సదాశివ ప్రధాన ఆలయం నుంచి సిద్ధిగిరి రామగిరి యోగి పుంగవుల సమాధి మందిరం వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి వస్తారు. అభిజిత్ ముహూర్తాన స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహిస్తారు. ఆది దంపతుల కల్యాణాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసన సభ్యుడు గంప గోవర్ధన్ కల్యాణోత్సవానికి హాజరు కానున్నారు. అదే రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో సిద్ధగిరి మహంతు సిద్ధగిరి రామగిరి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రుద్రకారుడైన సిద్ధరామేశ్వరాలయం వరకు పరిగెత్తుకొని వస్తారు.
ఈ ఘట్టాన్ని చూసేందుకు ప్రజలు బారులు తీరుతారు. చాలా మంది మహంతు పాదస్పర్ష కోసం పొర్లు దండాలు పెడుతూ దారిపై పడుకుంటారు. గర్భాలయంలోకి ప్రవేశించి నారికేళ ఫల నైవేద్యాన్ని సమర్పించిన మహంతు భక్తుల దర్శనార్థం స్వామి పుష్కరిణి సమీపంలోని వేదికపై ఆసీనులవుతారు. ఆ సమయంలో భక్తులు దర్శంచుకొని పాదాభివందనం చేస్తారు. రాత్రి 2 గంటల సమయం( తెల్లవారితే మంగళవారం) లో సిద్ధరామేశ్వరస్వామి వారి విమాన రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పూలు, అరటి కొమ్మలతో అందంగా అలంకరించిన రథంపై స్వామి, అమ్మవార్లను వేంచేబు చేయిస్తారు. అనంతరం రథి పూజలు నిర్వహించి, కూష్మాండ బలిహరణం చేస్తారు. హరహర మహాదేవ నినాదాల మధ్య ఆదిదంపతుల రథం ముందుకు సాగుతుంది.
ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు, స్వామి వారి రథాన్ని లాగేందుకు వేలాది మంది భక్తులు బారులు తీరుతారు. ప్రధానాలయం వద్ద ప్రారంభమైన రథం రైలు పట్టాలు దాటే వరకు (మాలె) వచ్చి వెను దిరుగుతుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తారు. బుధవారం అవబృద స్నానంతో సిద్ధరామేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
also read

