Telangana :లోక్ సభ బరిలో సామాన్యులు!

Telangana :తెలంగాణ(Telangana) లోక్ సభ ఎన్నికల బరిలో సామాన్యులు పోటీలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల గొంతుకగా బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఆమెకు సోషల్ మీడియా నుంచి పూర్తి స్థాయి సపోర్ట్ లభించింది. పలు స్వచ్ఛంద సంస్థలు వెన్నంటి నిలిచాయి. హైకోర్టు ఆదేశాలతో ఆమెకు ప్రభుత్వం సెక్యూరిటీ కూడా కల్పించింది. నిరుద్యోగులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు ఆమెకు వెన్నంటి నిలిచి ప్రచారంలో పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి పలువురు ఆర్థిక సాయం కూడా చేశారు. దేశం మొత్తం చూపును తనవైపు తిప్పుకున్నారు బర్రెలక్క. జాతీయ మీడియా సైతం బర్రెలక్క ఇంటర్వ్యూల కోసం నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లికి వచ్చింది. అలా యావత్ దేశాన్ని ఆకర్షించిన బర్రెలక్క ఈ సారి నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అదే నియోజకవర్గం నుంచి కరోనా సమయంలో సేవలందించిన నర్స్ భారతి దాసరి కూడా ఈసారి పోటీలో నిలుస్తుండటం గమనార్హం. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) నర్సుగా భారతి మూడు సంవత్సరాలు సేవలు అందించారు. అనంతరం నిలోఫర్ ఆసుపత్రికి బదిలీ అయ్యారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం మేడికొండ గ్రామానికి చెందిన భారతి హైదరాబాద్‌లోని అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో నర్సింగ్‌లో తన బీఎస్సీ పూర్తి చేసింది. జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER)లో నర్సింగ్‌లో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ (MSc) చదివింది. . ప్రస్తుతం, ఆమె హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బి చివరి సంవత్సరం చదువుతోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం భారతి దాసరిపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. ఆమె తన వద్ద రూ.4.06 లక్షల విలువైన చరాస్తులు, స్థిరాస్తులు ఉన్నట్లుగా ప్రకటించారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో గర్భిణుల పట్ల సరైన శ్రద్ధ కనబరచడం లేదని, నర్సింగ్ కళాశాలల పాఠ్యాంశాలు చాలా కాలంగా స్తబ్దుగా ఉన్నాయని ఆమె అన్నారు. రోడ్ల పరిస్థితులు అధ్వాన్నమైనంగా ఉన్నాయని.. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ సమస్యలు పరిష్కారిస్తానని భారతి తెలిపారు. ఇక వీసీకే పార్టీ నుంచి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులుగా జె.పద్మజ, పగిడిపల్లి శ్యామ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

ALSO READ :