Tirumala :ఏపీలో ఏర్పడబోయే సర్కారుతో సత్సంబంధాలుండాలి

సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ ఉదయం తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయ ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ మహా ద్వారం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు స్వాగతం పలికారు. ఈవో ధర్మారెడ్డి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సారి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకు ముందు రేవంత్‌ రెడ్డి శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. దర్శనానంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దర్శనార్థం వచ్చే భక్తులు సౌకర్యార్థం.. కళ్యాణమండపాలు, సత్రాలు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీటీడీకి సహకరిస్తుందని స్పష్టం చేశారు.

ALSO READ :