UPSC :యూపీఎస్సీ చైర్ పర్సన్ గా ప్రీతీసూదన్

కేంద్రం ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి, 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్(UPSC) కమిషన్ చైర్ పర్స్ న్ గా నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 37 ఏండ్ల పాటు ప్రభుత్వ పరిపాలనా విభాగాల్లో ఆమె పనిచేశారు. కొవిడ్–19 పాండమిక్ పీరియడ్ లో ఆమె కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆహారం పౌరసరఫరాలు, మహిళా, శిశు సంక్షేమ శాఖ, రక్షణ శాఖల్లో కీలక పదవులు నిర్వర్తించారు. విపత్తుల నిర్వహణ, పర్యాటక, వ్యవసాయ శాఖల్లోనూ సేవలందించారు. ఆర్థికశాస్త్రంలో ఎంఫిల్ పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బేటీ బచావ్ బేటీ పడావో, ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య కమిషన్ లో కీలక బాధ్యతల్లో విధులు నిర్వర్తించారు. 29 నవంబర్ 2022లో యూపీఎస్సీ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను కేంద్ర ప్రభుత్వం యూపీఎస్సీ చైర్ పర్సన్ గా(UPSC) నియమించింది. ఇటీవలే రాజీనామా చేసిన మనోజ్ సోని నుంచి ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. సోని ఐదేళ్లపాటు పదవిలో కొనసాగాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్ష్యంలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.

ALSO READ :