బంగ్లాదేశ్ (Bangladesh) పార్లమెంటును రద్దు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు షాహబుద్దీన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్ (Bangladesh) లో రిజర్వేషన్ల కోసం మొదలైన నిరసనలు ఏకంగా దేశాన్నే సంక్షోభంలో పడేశాయి. ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టిన నిరసనకారులు దేశాన్ని హింసాత్మకంగా మార్చడంతో ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. పార్లమెంటు రద్దు చేయాలంటూ ఇవాళ నిరసనకారులు ఆందోళనలు ప్రారంభించారు.
దీంతో ప్రెసిడెంట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకోగా, ఆ వెంటనే మాజీ ప్రధాని, షేక్ హశీనాకు రాజకీయాల్లో బద్ద శత్రువైన ఖలీదా జియాను విడుదల చేయాలంటూ ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. 2018లో ఓ కుంభకోణంలో ఖలీదా అరెస్టయ్యారు. ఇవాళ రాత్రి వరకు బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
విద్యార్థి సంఘాలతో ఆర్మీ చీఫ్ చర్చలు
కాసేపట్లో నహిద్, ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌తో భేటీ కానున్నారు. ఈ విద్యార్థుల బృందం సైన్యం లేదా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అంగీకరించడంలేదు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ చీఫ్ అడ్వైజర్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విద్యార్థి ఉద్యమం ఆమోదం లేని ఏ ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నహిద్ ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.
ఉద్యమం ఉప్పెనై..
బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మార్చేస్థాయిలో జరిగిన రిజర్వేషన్ల ఉద్యమం ఇప్పుడు ప్రపంచం దృష్టిని మరల్చింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది నహిద్ ఇస్లామ్ అనే 26 ఏండ్ల యువకుడు. చిన్నపాటి ఆందోళనగా మొదలై.. ఉద్యమమై.. ఉప్పెనై.. ఆ దేశ ప్రభుత్వాన్నే కూల్చేసింది.
జాతీయ పతాకన్ని తలపాగాలా ధరించి కనిపించిన ఆ యువకుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ గా మారిపోయాడు. నహిద్ ఇస్లామ్.. ఢాకా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ స్టూడెంట్. ఈ ఏడాది జులైలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నహిద్, మరికొందరు విద్యార్థులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అదే ఉద్యమం తుపానుగా మారి ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది.
ఈ ఘర్షణల్లో 300 మంది విద్యార్థులు మరణించారు. వీరిలో చాలా మంది వివిధ వర్సిటీల్లో చదివే వారే. పరిస్థితులు అదుపు తప్పడంతో హసీనా పదవికి రాజీనామా చేసి పారిపోయారు.
Also read:
