రుణమాఫీ చేసి చూపించామని సిద్దిపేట ఎమ్మెల్యే (Harish) హరీశ్ రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సిగ్గు, శరం, ఉంటే రాజీనామా చేయాలన్నారు. చీము, నెత్తురు, లజ్జా ఉంటే మాట నిలబెట్టుకోవాలని సవాలు విసిరారు. ‘నువ్వు రాజీనామా చేయవు.. నీది సిగ్గులేని జాతి.. నీ మామ లెక్కనే సిగ్గులేనోడివైతే ఏట్ల దుంకి సావు.. రాజీనామా చేస్తే.. అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ముక్కు నేలకు రాయ్..’అంటూ ( Harish) హరీశ్ రావుపై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వైరాలో నిర్వహించిన మూడో విడుత రుణమాఫీ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించారని,
దానిని అమలు చేసి చూపించామని అన్నారు. 2004 ఎన్నికల సమయంలో తెలంగాణ ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తామని ప్రకటించారని, చెప్పినట్టుగానే 2014లో చేసి చూపించారని అన్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని అన్నారు. ఇవాళ 18 వేల కోట్లకు పైగా రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తున్నామని సీఎం చెప్పారు. 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే సాధించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషి ఎంతో ఉందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రచారానికి వచ్చి రెండు ఎంపీ సీట్లలో గెలిపిస్తే రైతు రుణమాఫీ చేస్తానని భద్రాద్రి రాముని సాక్షిగా చెప్పానని.. దానిని అమలు చేశానని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గాడిద గుడ్డే ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు. ప్రజలు అండగా ఉంటే ఆ పార్టీని బంగాళాఖాతంలోకి విసిరేస్తానని అన్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు బావాబావమర్దులు తిరుగుతుండ్రని, కేటీఆర్, హరీశ్ రావు ను ఉద్దేశించి అన్నారు. మీ పదేండ్ల పాలనమీద, మా 8 నెలల పాలన మీద చర్చకు సిద్ధమా అంటూ సవాలు విసిరారు. డిప్యూటీ సీఎం బీఆర్ఎస్ నాయకులకు విసిరిన సవాలుకు తాను మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. అభివృద్ధిపై చర్చకు ఎక్కడికి వస్తారో చెప్పాలని, తమ పార్టీ తరఫున భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారని అన్నారు. టీవీలు, పేపర్లున్నయ్ కదా అని అడ్డగోలు రాద్దామనుకుంటే కుదరదని అన్నారు. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదని అన్నారు. తండ్రి మొఖం చాటేశాడని, కొడుకు బయటికి వచ్చి అబద్ధాలు ఆపడం లేదని కేసీఆర్, కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. డిపాజిట్లు పోయినా కేటీఆర్ కు బుద్ధి రాలేదన్నారు. మీ మాటలు నమ్ముతే మీకు పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటైనా ప్రజలు ఇచ్చేటోళ్లు కదా అని అన్నారు. బీఆర్ఎస్ బతుకు బస్టాండైందని, బంజారాహిల్స్ బస్టాండ్ లో అడుక్కతినే పరిస్థితి వచ్చిందని సీఎం అన్నారు.
Also read:

